![]() |
![]() |

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్.. సౌత్, బాలీవుడ్ హీరోల మధ్య చిచ్చు పెడుతోంది. సౌత్ నుంచి వచ్చిన 'పుష్ప-1', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2' వంటి పాన్ ఇండియా సినిమాలు హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో బాలీవుడ్ హీరోలు ఢీలా పడిపోతున్నారు. దానికితోడు సౌత్ హీరోల చేస్తున్న కామెంట్స్ తో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.
సౌత్ సినిమాలకు నార్త్ లో ఆదరణ లభించినట్లుగా.. హిందీ సినిమాలకు సౌత్ లో ఆదరణ లభించట్లేదంటూ ఇటీవల సౌత్ సినిమాల డామినేషన్ ను పరోక్షంగా అంగీకరించాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. అయితే మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మాత్రం హిందీ సినిమానే గొప్ప అని, ప్రాంతీయ సినిమాలు చేసే అవసరం తనకు లేదంటూ సౌత్ సినిమాలను తక్కువ చేసేలా కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ దానికి కౌంటర్ అన్నట్లుగా ఉన్నాయి. మన సినిమాలే అన్ని చోట్లా ఆడుతుంటే, మనం ప్రత్యేకంగా హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు. ఇలా సౌత్, బాలీవుడ్ హీరోలు రకరకాల కామెంట్స్ చేసున్నారు. ఇక తాజాగా కన్నడ హీరో సుదీప్ చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారి తీశాయి.

"బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను సౌత్ భాషల్లో డబ్ చేసి హిట్ కొట్టడానికి కష్టపడుతుంటే.. మన సినిమాలు మాత్రం అన్ని చోట్లా సక్సెస్ అవుతున్నాయి.. ఇకపై హిందీ జాతీయ భాష కాదు" అంటూ సుదీప్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తప్పుబట్టాడు. హిందీ జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఇప్పటికీ ఎప్పటికీ హిందీనే మన జాతీయ భాష అని అజయ్ ట్వీట్ చేశాడు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్ ట్వీట్ చేయడంతో.. అజయ్ మనమంతా ఒకటే అని, మన మాతృ భాషని గౌరవించుకుంటూనే ఇతర భాషలను గౌరవించుకోవాలంటూ ట్వీట్ చేశాడు.

ఇలా ఇద్దరు హీరోలు వరుస ట్వీట్స్ తో రెచ్చిపోతుంటే.. మరో వైపు సౌత్ ఆడియన్స్ అజయ్ ని పాన్ మసాలా స్టార్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
![]() |
![]() |