![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటిలో `నారీ నారీ నడుమ మురారి` ఒకటి. బాలయ్య 50వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి తెరకెక్కించగా.. యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై కె. మురారి నిర్మించారు. ఇందులో బాలకృష్ణకి జంటగా శోభన, నిరోషా కనువిందు చేయగా.. అత్త పాత్రలో `ఊర్వశి` శారద ఆకట్టుకున్నారు. అంజలీ దేవి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, తనికెళ్ళ భరణి, బాబూమోహన్, అనంత్, చిట్టిబాబు, రమాప్రభ, శ్రీలక్ష్మి, మమత, కల్పనా రాయ్, వంకాయల సత్యనారాయణ, చిడతల అప్పారావు, పొట్టి ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ గీతరచయితలు ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``మనసులోని``, ``ఏం వానో``, ``పెళ్ళంటూనే``, ``వయసు సొగసు``, ``దుత్తలాగున్నావే రత్తమ్మత్తా``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. కాగా, 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించిన `నారీ నారీ నడుమ మురారి`.. నేటితో 32 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |