![]() |
![]() |
.webp)
'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకొని నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా రానున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇంతవరకు కనీసం ఓపెనింగ్ కూడా జరగని ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం తాజాగా ఈ సినిమా గురించి కొరటాల చేసిన వ్యాఖ్యలే.
చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'NTR30' గురించి కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది ఎమోషన్స్ తో కూడిన పక్కా మాస్ ఫిల్మ్ అని, ఇందులో 'మిర్చి' సినిమాని మించిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని అన్నాడు. ఇప్పటిదాకా తాను రాసిన స్క్రిప్ట్స్ లో ఇది చాలా పవర్ ఫుల్ అని, ఎన్టీఆర్ రోల్ చాలాకాలం పాటు గుర్తుండిపోతుందని చెప్పాడు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ కమర్షియల్ సినిమాలో బలమైన ఎమోషన్స్ ఉంటాయని కొరటాల తెలిపాడు.
కొరటాల కామెంట్స్ తో 'NTR30'పై అంచనాలు రెట్టింపయ్యాయి. తారక్ ఫ్యాన్స్ సంతోషంగా వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో #NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా గతంలో తారక్-కొరటాల కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ట్రీట్ ఇస్తానంటున్నాడు కొరటాల. ప్రస్తుతం నార్త్ ఆడియన్స్ సైతం కమర్షియల్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. కొరటాల చెప్పిన స్థాయిలో 'NTR30' ఉంటే, 'ఆర్ఆర్ఆర్'తో హిందీ లోనూ గుర్తింపు తెచ్చుకున్న తారక్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
![]() |
![]() |