![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబు - అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `ప్రేమమూర్తులు` ఒకటి. శోభన్ బాబు కి జంటగా లక్ష్మి, రాధ నటించిన ఈ సినిమాలో మురళీ మోహన్ ఓ కీలక పాత్రలో కనిపించగా.. రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, హేమసుందర్, కేకే శర్మ, నిర్మల, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. కథ విషయానికి వస్తే.. ధనవంతురాలైన జ్యోతి (లక్ష్మి), మధ్య తరగతి యువకుడైన కిరణ్ (శోభన్ బాబు) మెడికల్ స్టూడెంట్స్. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఉన్నత చదువుల కోసం జ్యోతి విదేశాలకు వెళుతుంది. అదే సమయంలో.. కిరణ్ స్నేహితుడు మురళి (మురళీ మోహన్) ఓ ప్రమాదంలో చనిపోతూ.. తను పెళ్ళాడాల్సిన రాధ (రాధ)ని పెళ్ళి చేసుకోమని కోరతాడు. దాంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో రాధని వివాహమాడతాడు కిరణ్. ఈ విషయం తెలిశాక జ్యోతి ఎలా స్పందించింది? ఆ తరువాతి పరిణామాలేంటి? అనేదే మిగిలిన సినిమా.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రంలో ``మావారు బంగారు కొండ``, ``చెంపకు చారెడు కళ్ళు``, ``సిరి సిరి మువ్వల నవ్వు``, ``తారక చెప్పదు ఏ నాడు``, ``ఊరుకో ఏడవకు``, ``చిటారు కొమ్మన చిన్నారి గువ్వల గూడుంది`` అంటూ సాగే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించిన `ప్రేమమూర్తులు`.. 1982 ఏప్రిల్ 21న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |