![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి, వీకెండ్‌లో గ్లోబల్‌గా నంబర్ 2 ప్లేస్‌లో సగర్వంగా నిలిచింది. 'కేజీఎఫ్ 2' కంటే ముందున్నది హాలీవుడ్ ఫిల్మ్ 'ఫెంటాస్టిక్ బీస్ట్స్' మాత్రమే. ఆదివారం నాలుగో రోజు సాధించిన రూ. 132.13 కోట్లతో కలుపుకొని, గ్లోబల్‌గా నాలుగు రోజుల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' సాధించిన వసూళ్ల గ్రాస్ రూ. 551.83 కోట్లకు చేరుకుంది.
అంతకుముందు ఈ మూవీ మొదటి రోజు గురువారం రూ. 165.37 కోట్లు, శుక్రవారం రూ. 139.25 కోట్లు, శనివారం రూ. 115.08 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. కర్నాటక నుంచి వచ్చిన ఒక సినిమా ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం ఇదే తొలిసారి. దాంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంతో ఉప్పొంగిపోతోంది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో తాము కూడా తక్కువ తినలేదని ఆ ఇండస్ట్రీ చాటి చెప్పినట్లయింది. సౌత్‌లో కమర్షియల్‌గా తెలుగు, తమిళ చిత్రాలే ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోగా, ఇప్పుడు కన్నడ సినిమా కూడా ఆ లిస్టులో చేరింది.
గ్లోబల్‌గా బాక్సాఫీస్ కలెక్షన్‌ను అంచనా వేసే 'కామ్‌స్కోర్' ప్రకారం నాలుగు రోజుల వీకెండ్‌లో 'కేజీఎఫ్ 2' మూవీ 72.381 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ. 551.83 కోట్లు)ను వసూలు చేసింది.
![]() |
![]() |