![]() |
![]() |

దర్శకరత్న దాసరి నారాయణరావు మంచి నిర్దేశకుడు మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. తను ప్రధాన పాత్రలో నటించిన కొన్ని చిత్రాలు తెలుగునాట విశేషాదరణ పొందడమే ఇందుకు నిదర్శనం. అలా ఘనవిజయం సాధించిన చిత్రాల్లో `సూరిగాడు` ఒకటి. సూరిగాడుగా దాసరి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా సుజాత నటించగా.. మరో జంటగా సురేశ్, యమున దర్శనమిచ్చారు. గొల్లపూడి మారుతీరావు, రాళ్ళపల్లి, సుత్తి వేలు, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, మాగంటి సుధాకర్, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. దాసరి స్వయంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఓ స్వార్ధపూరిత కొడుకుపై ఓ తండ్రి చేసే న్యాయపోరాటమే `సూరిగాడు` చిత్రం.
సాలూరి వాసూరావు సంగీతమందించిన ఈ చిత్రంలో ``ఒకే ఒక ఆశ``, ``అమ్మ లాలో అమ్మ లాలో``, ``కొట్టిందమ్మో కొట్టిందమ్మో``, ``ఎన్నిసార్లు లెక్కపెట్టినా``, ``ఊపేది ఎవ్వరైనా``, ``భారతాన్ని రాశాడు``.. అంటూ సాగే పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించిన `సూరిగాడు`.. హిందీలో దాసరి దర్శకత్వంలోనే `సంతాన్` (1993) పేరుతో రీమేక్ అయింది. 1992 ఏప్రిల్ 17న విడుదలై ఘనవిజయం సాధించిన `సూరిగాడు`.. ఈ ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |