![]() |
![]() |

పునర్జన్మల నేపథ్యంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పలు చిత్రాలు చేశారు. వాటిలో `బంగారు బొమ్మలు` ఒకటి. ఏయన్నార్ తో అనేక విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత వీబీ రాజేంద్ర ప్రసాద్.. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. అలాగే, కథ - స్క్రీన్ ప్లే కూడా తనే సమకూర్చారు. ఇందులో ఏయన్నార్ కి జంటగా మంజుల నటించగా అంజలీ దేవి, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, రావు గోపాలరావు, రాజబాబు, ధూళిపాళ, కేవీ చలం, సూర్యకాంతం, ఛాయాదేవి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ రచయిత ఆచార్య ఆత్రేయ సాహిత్యమందించారు. ఇందులోని ``నేనీ దరిని నువ్వా దరిని`` పాట విశేషాదరణ పొందగా.. ``అయ్యయ్యో బంగారు బాబు``, ``నేను నేనుగా``, ``ఇది పొగరుబోతు``, ``ఆ సుబ్బయ్య సూరయ్య``, ``అమ్మా తీరిపోయిందా.. తీయని బంధం`` గీతాలు కూడా రంజింపజేశాయి. ఈ పాటలన్నింటిని ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి. సుశీల గానం చేశారు. 1977 ఏప్రిల్ 14న విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన `బంగారు బొమ్మలు`.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |