![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాతో తారక్, చరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఇద్దరి నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే చాలామంది తారక్ పోషించిన భీమ్ పాత్ర కంటే, చరణ్ పాత్ర పోషించిన రామ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని రాజమౌళి ఖండించాడు. అంతేకాదు భీమ్ పాత్రకి తారక్ తప్ప మరెవరూ ఆ స్థాయిలో న్యాయం చేయలేరని ఆకాశానికెత్తేశాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమా అంతా ఒకెత్తు అయితే అందులో 'కొమురం భీముడో' సాంగ్ మరో ఎత్తు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ సాంగ్ లో తారక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఓ హిందీ న్యూస్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ సాంగ్ లో తారక్ చేసినట్లుగా ఇండియాలో మరే నటుడు చేయలేదని ప్రశంసించాడు. కోపం, బాధ, ప్రేమ ఇలా ఇన్ని భావాలు ఒకేసారి ముఖంలో పలికించడం తారక్ కి మాత్రమే సాధ్యమని రాజమౌళి కొనియాడాడు.
అలాగే ఈ సినిమాలో ఒక హీరో పాత్ర ఎక్కువ, ఒక హీరో పాత్ర తక్కువ అంటే తాను ఒప్పుకోనని రాజమౌళి అన్నాడు. క్లైమాక్స్ లో రామ్ పాత్రకి ఎక్కువ స్పేస్ దొరికిందని, అందువల్ల బయటకు వచ్చేటప్పుడు చరణ్ పాత్ర ఎక్కువ ఉందన్న అభిప్రాయం కలిగి ఉండొచ్చని అన్నాడు. ఒకవేళ కొమురం భీముడో సాంగ్ దగ్గర సినిమా ఆపేసి ఉంటే.. తారక్ పాత్ర ఎక్కువ ఉంది అనిపించేదని తెలిపాడు. ఒక పాయింట్ లో చూస్తే చరణ్ ని తారక్ రెండుసార్లు సేవ్ చేస్తే, చరణ్ మాత్రం తారక్ ని ఒక్కసారే సేవ్ చేస్తాడని గుర్తుచేశారు. అలాగే తారక్ పాడిన ఒక్క పాటతో చరణ్ తన ఆశయం కోసం ఎంచుకున్న మార్గాన్నే మార్చుకుంటాడని.. దానిని బట్టి చూస్తే తారక్ ని చరణ్ ఫాలో అయినట్లు ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించారని.. ఒక పాత్ర ఎక్కువ ఒక పాత్ర తక్కువ కాదని రాజమౌళి అన్నాడు. రెండు పాత్రలు బ్యాలెన్స్ చేయకపోతే ఈరోజు ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసుండేది కాదని రాజమౌళి అభిప్రాయపడ్డాడు.
![]() |
![]() |