![]() |
![]() |

ప్రేమించి పెళ్లి చేసుకొని, కొంత కాలం క్రితం విడిపోయారు నాగచైతన్య, సమంత. వాళ్లు వేరుపడటం అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. సమంత ప్రవర్తన కారణంగానే చైతూ ఆమె నుంచి విడిపోయాడంటూ కొంతమంది కామెంట్లు చేశారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత చేసిన బోల్డ్ క్యారెక్టరే వారి మధ్య దూరం పెంచిందంటూ ఇంకొంతమంది తీర్మానాలు చేశారు. ఏదేమైనా వారు విడిపోయారు. ఎప్పుడైతే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అక్కినేని అనే ఇంటిపేరును సమంత తొలగించిందో, అప్పుడే జనానికి అర్థమైపోయింది.. ఏదో జరిగిందని.
ఆ తర్వాత చైతూతో తను కలిసున్న ఫొటోలన్నింటినీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి సామ్ తొలగించింది. కాకపోతే, రానా పెళ్లినాటి ఫొటోలను మాత్రం ఉంచేసింది. ఇన్నాళ్ల తర్వాత తొలిసారిగా తన మాజీ భర్త చైతన్యతో కలిసున్న ఓ ఫొటోను సమంత షేర్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అది ఒక సినిమాకు సంబంధించిన పోస్టర్. చైతూ, సామ్ జంటగా నటించిన 'మజిలీ' బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టయింది. యాక్టర్లుగా ఇద్దరికీ ఆ సినిమా మంచి పేరు తెచ్చింది.
'మజిలీ' విడుదలై ఏప్రిల్ 5కి మూడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది సామ్. ఆ పోస్టర్‌లో చైతూ ప్రముఖంగా కనిపిస్తున్నాడు. అలాగే సమంతతో, మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌తో చైతూ కలిసున్న స్టిల్స్ కూడా ఆ పోస్టర్‌లో ఉన్నాయి. ఈ పోస్టర్‌ను సమంత షేర్ చేయడం ఆలస్యం.. ఆమె పోస్ట్ వైరల్‌గా మారిపోయింది. స్క్రీన్‌పై చైతూ-సామ్ జోడీ సూపర్ హిట్టంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ వచ్చారు.

![]() |
![]() |