![]() |
![]() |

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' అనే మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతోంది. లెస్బియన్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. మూవీ విడుదల దగ్గర పడటంతో పాటు రేపు(ఏప్రిల్ 7న) ఆర్జీవీ పుట్టినరోజు కావడంతో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
2018 లో సెక్షన్ 377 పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ఈ లెస్బియన్ స్టోరీ తీయాలన్న ఆలోచన వచ్చిందని అన్నారు. అయితే ఇందులో వాళ్ళు లెస్బియన్స్ ఎందుకు అయ్యారు? వాళ్ళ మీద సింపతీ క్రియేట్ చేయడం లాంటివి చూపలేదని.. కేవలం వాళ్ళని లీడ్ పెయిర్ గా తీసుకొని, క్రైమ్ డ్రామా తెరకెక్కించామని అన్నారు. దీనిని మూడు భాషలలో విడుదల చేయాలని ముందు ప్లాన్ చేయలేదని తెలిపారు. పాన్ ఇండియా అనేది ఎప్పుడో డైరెక్టర్ శంకర్ తో స్టార్ట్ అయిందని, 'జెంటిల్ మేన్' వంటి సినిమాలు అప్పుడే ఎక్కువ భాషల్లో విడుదల అయ్యాయని గుర్తుచేశారు. మనం ఏ సినిమా అయినా, ఏ ల్యాంగ్వేజ్ అయినా రిలీజ్ చేయొచ్చని.. వాళ్ళు చూస్తారా లేదా అనేది తర్వాత సంగతి అని ఆర్జీవీ అన్నారు.
తాను పెద్ద స్టార్స్ తో సినిమాలు చేయనని, అసలు స్టార్స్ తో సినిమా చేయడం తనకి రాదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. తాను ఎవరికోసం సినిమాలు తీయట్లేదని, తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటున్నానని తెలిపారు. చెత్త సినిమాలు తీస్తున్నానని కొందరు అనుకోవచ్చు కానీ తానేం చేస్తున్నానో తనకి తెలుసని అన్నారు. బడ్జెట్ ని బట్టే ప్రాఫిట్స్ ఉంటాయని.. ఉదాహరణకు తాను తీసిన నేక్డ్ షార్ట్ ఫిల్మ్ కి 2 వేలు ఖర్చు అయిందని, కానీ దానికి యూట్యూబ్ లో 80 లక్షల వ్యూస్ వచ్చాయని ఆర్జీవీ చెప్పారు. తన దగ్గర 20 స్క్రిప్ట్స్ ఉంటాయని.. వాటిల్లో ఏది ముందో ఏది తర్వాతో చెప్పలేమని ఆర్జీవీ అన్నారు.
![]() |
![]() |