![]() |
![]() |

కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలు అందుకున్న అతి కొద్దిమంది కథానాయకుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. `గంగోత్రి` (2003), `ఆర్య` (2004) వంటి రెండు వరుస ఘనవిజయాల తరువాత అల్లు అర్జున్ హీరోగా నటించిన `బన్ని` (2005) కూడా అదే బాట పట్టింది. తెలుగునాట బన్నీని కాస్త హ్యాట్రిక్ హీరోగా నిలిపింది. స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేసిన `బన్ని`లో అల్లు అర్జున్ కి జంటగా నూతన కథానాయిక గౌరీ ముంజల్ నటించగా ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, శరత్ సక్సేనా, సుధ, సీత, ముకేశ్ రిషి, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, రాజన్ పి. దేవ్, చలపతిరావు, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ఫిష్ వెంకట్, జెన్నీ, చిత్రం శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలకు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, విశ్వ సాహిత్యమందించారు. ఇందులోని ``బన్ని బన్ని`` అంటూ సాగే పాట చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``జాబిలమ్మవో``, ``మయిలు మయిలు``, ``వా వా వారెవా``, ``మారో మారో``, ``కనపడలేదా`` గీతాలు కూడా రంజింపజేశాయి. సిరి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. సత్యనారాయణ రెడ్డి నిర్మించిన `బన్ని`.. 2005 ఏప్రిల్ 6న విడుదలై విజయపథంలో పయనించింది. నేటితో ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా 17 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |