![]() |
![]() |

నిషాలో ఉండొద్దనీ, డ్రగ్స్ జోలికి పోవద్దనీ పాడి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ఓ పబ్‌లో డ్రగ్ పార్టీలో పోలీసులకు దొరికిపోయాడు సింగర్, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అవును. హైదరాబాద్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన డ్రగ్ రహిత హైదరాబాద్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, అందులో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనీ, డ్రగ్స్‌కు ఒకసారి బానిస అయితే అంతే సంగతులంటూ పాట పాడాడు. డ్రగ్స్ అనేవి జీవితాన్ని నాశనం చేస్తాయని పాడాడు.
ఫిబ్రవరి 12న బోరబండలోని ప్రొఫెసర్ జైశంకర్ కమ్యూనిటీ హాల్లో డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన పాటను రాహుల్ తనదైన స్టైల్లో పాడి అలరించాడు. మణిశర్మ మ్యూజిక్ సమకూర్చగా, కాసర్ల శ్యామ్ ఆ పాటను రాశాడు. డ్రగ్స్‌కు ఎడిక్ట్ కాకుండా ప్రజల్ని చైతన్యవంతం చేయడం ఆ పాట ఉద్దేశం.
అలాంటిది.. ఇప్పుడు ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లోని మింక్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ పాకెట్లు లభించడం కలకలం సృష్టించింది. నిర్ణీత సమయం దాటిపోయి గంటలు గడిచినా పబ్ తెరిచే ఉంచడం, పార్టీలో పలువురు యంగ్ సెలబ్రిటీలు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. వారిలో నిహారిక కూడా ఒకరు. హైదరాబాద్ కూడా డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోతున్నదనే వాదనను ఈ పార్టీలో లభించిన డ్రగ్స్ బలపరిచేలా ఉన్నాయి.
![]() |
![]() |