![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి రూపొందించగా మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో కొమరం భీమ్ పాత్రలో గొప్పగా రాణించి, అందర్నీ అలరించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా సాధిస్తోన్న విజయం, తన నటనకు వస్తున్న ప్రశంసలను ఆస్వాదిస్తున్న అతను మంగళవారం ఓ సుదీర్ఘ లేఖ ద్వారా ఆ సినిమాకు పనిచేసిన వారందరినీ అభినందించాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకూ, తన అభిమానులకూ ధన్యవాదాలు తెలియజేశాడు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన లేఖను "మీరందరూ 'ఆర్ఆర్ఆర్'పై ఆ సినిమా విడుదలైన దగ్గర్నుంచీ అమితంగా ప్రశంసిస్తూ ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా నిలిచే అవకాశాలున్న 'ఆర్ఆర్ఆర్' నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను" అంటూ ప్రారంభించాడు తారక్. విలక్షణమైన వాటర్ లాగా తను ఫీల్ అవడానికీ, తన నుంచి ఉత్తమమైన నటనను రాబట్టిన జక్కన్నకు థాంక్స్ చెప్పాడు. 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ లేకుండా యాక్ట్ చేయడాన్ని అసలు ఊహించుకోలేనని అన్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని అభిప్రాయం వ్యక్తం చేసిన తారక్, అతను లేకుండా భీమ్ క్యారెక్టర్ కూడా సంపూర్ణం కాదన్నాడు.
లెజెండరీ అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపిన తారక్, తన ప్రెజెన్స్‌తో ఆలియా సినిమాకు గొప్ప బలాన్నిచ్చిందనీ, యాక్టర్‌గా ఆమె ఒక పవర్‌హౌస్ అనీ కొనియాడాడు. తమ ఉన్నతస్థాయి అభినయంతో ఒలీవియా, అలీసన్ డూడీ, రే స్టీవెన్సన్ అందరి హృదయాలనూ చూరగొన్నారని ప్రశంసించిన తారక్, ఇండియన్ సినిమాకు వారిని స్వాగతించాడు.
నిర్మాత డీవీవీ దానయ్య తమ వెనుక ఒక రాక్‌లాగా నిల్చున్నారనీ, ఒక కల లాంటి ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్ నిజమవడానికి కారణమయ్యారని ప్రశంసించాడు. సంగీత దర్శకుడు కీరవాణి, కథారచయిత విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, కళా దర్శకుడు సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్, ఎడిటర్ శ్రీకర ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ, 'కొమురం భీముడో' పాటను పాడిన కాలభైరవ, 'నాటు నాటు' సాంగ్‌కు సూపర్బ్ స్టెప్స్ కూర్చిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.
చివరగా భారతీయ మీడియాకు, తన అభిమానులకు థాంక్స్ చెప్పాడు. మరిన్ని సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు.
అయితే ఈ సినిమాలోని సన్నివేశాలకు సందర్భానుసారం పదునైన సంభాషణలు అందించిన బుర్రా సాయిమాధవ్ పేరును ప్రస్తావించడం మర్చిపోయాడు తారక్. అలాగే 'కొమురం భీముడో' పాటను పాడిన కాలభైరవకు థాంక్స్ చెప్పి, ఆ పాటను రాసిన సుద్దాల అశోక్‌తేజ పేరును ప్రస్తావించడాన్ని ఉపేక్షించాడు.

![]() |
![]() |