![]() |
![]() |

ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా నీరాజనాలు అందుకుంటున్న యస్.యస్. రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తోన్న ప్రభంజనం కంటిన్యూ అవుతోంది'. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన 'ఆర్ఆర్ఆర్' మరోసారి భారతీయ సినిమా సత్తాను చాటి చెపుతోంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన మునుపటి సినిమా 'బాహుబలి 2' వరల్డ్ వైడ్‌గా అఖండ విజయం సాధించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా రికార్డులపై 'ఆర్ఆర్ఆర్' గురిపెట్టింది. అంటే.. తన రికార్డులను తనే తిరగరాసుకుంటున్నాడు రాజమౌళి.
తెలుగునాట చూస్తే తొలి మూడు రోజులకు 'బాహుబలి 2' సాధించిన దానికంటే ఎంతో మిన్నగా 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు వచ్చాయి. విడుదలైన మొదటి మూడు రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'బాహుబలి 2' రూ. 74.40 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఆ రికార్డును దాటేసి, ఏకంగా రూ. 139.27 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగునాట మూడు ఏరియాల వారీగా చూసినా, 'బాహుబలి 2' కంటే 'ఆర్ఆర్ఆర్'దే పైచేయి. మూడు రోజుల విషయానికి వస్తే వీటి తర్వాత స్థానాల్లో 'సాహో' (రూ. 58.67 కోట్లు), 'సైరా' (రూ. 55.82 కోట్లు), 'వకీల్ సాబ్' (రూ. 53.37 కోట్లు), 'భీమ్లా నాయక్' (రూ. 53.07 కోట్లు), 'పుష్ప' (రూ. 52.98 కోట్లు) సినిమాలు ఉన్నాయి.
ఓవరాల్‌గా తెలుగునాట అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా రికార్డు 'బాహుబలి 2' పేరిటే ఉంది. ఆ మూవీ రూ. 204 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇప్పటివరకు దాని తర్వాత స్థానంలో రూ. 130.17 కోట్లతో 'అల.. వైకుంఠపురములో' ఉంది. ఇప్పుడు మూడు రోజుల్లోనే రూ. 139.27 కోట్లతో రెండో స్థానంలోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చేసింది. లైఫ్‌టైమ్ కలెక్షన్ల విషయంలో 'బాహుబలి 2'ను 'ఆర్ఆర్ఆర్' దాటేస్తుందా, లేదా అన్నదే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న విషయం. ఇంకో రూ. 65 కోట్లను రాబడితేనే 'ఆర్ఆర్ఆర్' నంబర్‌వన్ ప్లేస్‌లో నిలుస్తుంది. చూద్దాం.. ఆ ఫీట్‌ను రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ అందుకుంటుందో, లేదో...
![]() |
![]() |