![]() |
![]() |

2018 లో విడుదలైన కన్నడ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్-1' దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఎంతోగానో ఆకట్టుకుంది. దీంతో ఏప్రిల్ 14 న విడుదల కానున్న 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేజీఎఫ్-2 ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ని చూస్తుంటే చాప్టర్-1 కి మించి చాప్టర్-2 ఉండబోతుందని అనిపిస్తోంది.
కేజీఎఫ్-2 టీజర్ ని ఎప్పుడో ఏడాది క్రితమే విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ తోనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే పాండెమిక్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ లో విడుదలకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు. "కేజీఎఫ్ లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది?" అంటూ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. "రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకు వెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది" వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. రాకీ భాయ్ గా యశ్, అధీరాగా సంజయ్ దత్ ల స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటోంది. "నాకు వైలెన్స్ నచ్చదు.. కానీ వైలెన్స్ కి నేను నచ్చుతాను" అంటూ యశ్ మరోసారి అదరగొట్టేశాడు. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండియర్ పరంగా చాప్టర్-1 ని మించి ఉందని అర్థమవుతోంది.

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చాప్టర్-1 ని మించిన సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |