![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతున్న వేళ ఈ సినిమాని కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాని కన్నడలో కాకుండా తెలుగులోనే ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసి మమ్మల్ని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు #BoycottRRRInKarnataka ను ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు.

'పుష్ప ది రైజ్' సమయంలో కూడా కన్నడిగులు 'బాయ్‌కాట్ పుష్ప'ను ఇలాగే ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సమయంలోనూ అదే రిపీట్ చేస్తున్నారు. నిజానికి కర్ణాటకలో తెలుగు సినిమాలు డైరెక్ట్ గానే చూస్తుంటారు. అందుకే అక్కడ కన్నడ వెర్షన్ లో పెద్దగా రిలీజ్ చేయరు. కానీ కొందరు కావాలనే ఇలా పెద్ద సినిమాల టైంలో ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక ఇప్పటికే బుక్ మై షోలో బెంగళూరులో ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ 8 షోలు ఉన్నట్లు చూపిస్తోంది. కానీ తెలుగు వెర్షన్ టికెట్స్ బుక్ అయినట్లుగా అవి అంతగా బుక్ అవట్లేదు. దీంతో ఉన్న 8 షోలకు టికెట్స్ బుక్ చేసుకోకుండా కావాలనే దురుద్దేశంతో ఇలా నెగటివ్ గా ట్రెండ్ చేస్తున్నారు అంటూ తెలుగు ఆడియన్స్ ట్విట్టర్ లో ఫైర్ అవుతున్నారు. ఇంకా కొందరైతే ఒకడుగు ముందుకు వేసి మీరు 'ఆర్ఆర్ఆర్'ని బాయ్‌కాట్ చేస్తే, మేం వచ్చే నెలలో రిలీజయ్యే మీ 'కేజీఎఫ్-2'ను బాయ్‌కాట్ చేస్తామంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఈ వివాదంపై 'ఆర్ఆర్ఆర్'ను కర్ణాటకలో విడుదల చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. ఈ సినిమా కోసం చరణ్, తారక్ ఎంతో కష్టపడ్డారని.. కన్నడ నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పారని తెలిపింది. ఈ సినిమాని కన్నడ వెర్షన్ లో చూడాలన్న మీ ప్రేమను అర్థం చేసుకోగలమని, మీ మద్దతుతో వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో కన్నడ వెర్షన్ రిలీజ్ చేస్తామని తెలుపుతూ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒక నోట్ రిలీజ్ చేసింది.

![]() |
![]() |