![]() |
![]() |

'మేము మేము బానే ఉంటాం.. మీరు మీరే ఇంకా బాగుండాలి' అని హీరోలు ఎంత మొత్తుకొని చెబుతున్నా కొందరు అభిమానుల తీరు మారట్లేదు. మెగా, నందమూరి హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఈ సినిమా చేయక ముందు నుంచే తాము ఫ్రెండ్స్ అని తెలిపిన తారక్, చరణ్.. సొంత అన్నదమ్ముల్లా అన్యోన్యంగా ఉండటం ఆకర్షిస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో అయితే 'ఈ సినిమాతో నా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు' అని తారక్ చెప్పిన మాట ఆకట్టుకుంది. మనందరం కలిసి ఉంటే ముందు ముందు ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో వస్తాయని ఇద్దరు హీరోలు పిలుపునిచ్చారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ తీరు మారడం లేదు. తాజాగా తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలో ఒక తారక్ అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం లేపింది.
కర్ణాటకలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ కొందరు రాజకీయ పార్టీల జెండాలు తెచ్చి ఘర్షణ వాతావరణానికి తెరదీశారు. తారక్, చరణ్ చెప్పిన మాటలతోనైనా ఫ్యాన్ వార్స్ కి బ్రేక్ పడుతుంది అనుకుంటే అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. మార్చి 25 న సినిమా విడుదల ఉండటంతో థియేటర్స్ దగ్గర ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పోటాపోటీగా బ్యానర్స్, కటౌట్స్ పెడుతున్నారు. కొన్ని చోట్ల ఇది ఘర్షణకు దారితీస్తోంది.
కోదాడలోని శ్రీనివాసా థియేటర్ వద్ద తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. థియేటర్ దగ్గర తారక్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ కడుతుండగా చరణ్ ఫ్యాన్స్ అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన తారక్ అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పక్కన ఉన్నవారు అలర్ట్ అయి అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తారక్ ఫ్యాన్ సూసైడ్ అటెంప్ట్ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫ్యాన్స్ తీరు మారకపోతే ముందు ముందు ఇలాంటి భారీ మల్టీస్టారర్స్ చేయడానికి హీరోలు వెనకడుగు వేస్తారని.. ఇప్పటికైనా ఇలా ఘర్షణ పడుతున్న ఆ కొందరు ఫ్యాన్స్ తీరు మారితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |