![]() |
![]() |

రష్యా దాడితో ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చదువు, ఉద్యోగం కోసం ఉక్రెయిన్ వెళ్లిన ఎందరో స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడున్న భారతీయులు కూడా వచ్చేస్తున్నారు. అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉండటంతో అందరిలో ఆందోళన నెలకొంది. అయితే ఒక తెలుగు డాక్టర్ మాత్రం తాను ఉక్రెయిన్ వదిలి రానని, మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో అక్కడే ఉంటానని అంటున్నాడు. అతని మాటలకు చిరంజీవి కూడా ఎమోషనల్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గిరికుమార్ కొన్నేళ్ళ క్రితం మెడిసిన్ చదువుకునేందుకు ఉక్రెయిన్ వెళ్ళాడు. చదువు పూర్తయ్యాక అక్కడే డాక్టర్ గా స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని అయిన గిరి కుమార్.. చిరంజీవి నటించిన 'లంకేశ్వరుడు' సినిమా స్ఫూర్తితో ఓ జాగ్వార్, ఓ పాంథర్ ను పెంచుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాటిని వదిలేసి వస్తే అవి ఆహారం లేక మరణిస్తాయని, అందుకే వాటిని వదిలి రాలేకపోతున్నానని గిరికుమార్ అంటున్నాడు. అతని ఎందరినో కదిలిస్తున్నాయి. చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

"డియర్ గిరికుమార్ నన్ను స్పూర్తిగా తీసుకొని జాగ్వార్, పాంథర్ పెంచుకుంటున్నావని తెలిసి ఎంతో ఆనందం కలిగింది. మూగ జీవాల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ ప్రశంసనీయం. నువ్వు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు చక్కబడే వరకు జాగ్రత్తగా ఉండు" అంటూ చిరు ట్వీట్ చేశాడు.
![]() |
![]() |