![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వడంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంకి వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని, ఈ విషయంపై మరోసారి సమావేశమై చర్చిస్తామని అన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణ సీఎం లను కలిసి సన్మానిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమలోని సమస్యలను తీర్చడానికి ముందుకొచ్చిన చిరంజీవే మాకు పెద్ద అని కల్యాణ్ అన్నారు.
కొత్త జీవోతో టికెట్ ధరల సమస్యకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేసిన తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్, జెమిని కిరణ్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ జీవో 'భీమ్లా నాయక్' విడుదలకు ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఎన్వీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |