![]() |
![]() |

వైవిధ్యానికి పెద్దపీట వేసే నిర్మాణ సంస్థల్లో ఉషాకిరణ్ మూవీస్ ఒకటి. 1980ల్లో ఈ సంస్థ నిర్మించిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. వాటిలో `మయూరి` ఒకటి. ప్రముఖ నర్తకి సుధా చంద్రన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డాన్స్ డ్రామాలో టైటిల్ రోల్ లో సుధా చంద్రన్ నే నటించడం విశేషం. వెర్సటైల్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రంలో శుభాకర్, పి.ఎల్. నారాయణ, వై. విజయ, నిర్మలమ్మ, చక్రి తోలేటి, ముక్కు రాజు, పొట్టి ప్రసాద్, కేకే శర్మ, సుత్తి వీరభద్రరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఈ చిత్రానికి గాన గాంధుర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతమందించగా, దిగ్గజ గీతరచయిత వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యమందించారు. ``ఇది నా ప్రియ నర్తన``, ``ఈ పాదం``, ``కైలాసంలో తాండవమాడే``, ``వెన్నెల్లో ముత్యమా``, ``మౌనం గానం మధురం``, ``గౌరీశంకర``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి.
Also Read: పవన్ తో ఏ దర్శకుడైనా మూడో సినిమా తీస్తే అంతేమరి..!
ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందిన `మయూరి`.. అప్పట్లో `నంది` పురస్కారాల పంట పండించింది. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ గాయకుడు` (ఎస్పీబీ), `ఉత్తమ సహాయ నటి` (నిర్మలమ్మ), `ఉత్తమ ఛాయాగ్రహకుడు` (శ్రీ హరి అనుమోలు), `ఉత్తమ ఎడిటర్` (గౌతంరాజు), `ఉత్తమ కళా దర్శకుడు` (వి. భాస్కరరాజు), `ఉత్తమ నృత్య దర్శకుడు` (శేషు), `ఉత్తమ ఆడియోగ్రాఫర్` (ఎమ్మి), `ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత` (సింగీతం, కె.ఎస్. ప్రకాశరావు, గణేశ్ పాత్రో), `ద్వితీయ ఉత్తమ కథా రచయిత` (ఉషాకిరణ్ మూవీస్ యూనిట్), స్పెషల్ జ్యూరీ (సుధా చంద్రన్), స్పెషల్ జ్యూరీ (పి.ఎల్. నారాయణ).. ఇలా 14 విభాగాల్లో `నంది` అవార్డులను అందుకుంది `మయూరి`.
అలాగే `ఉత్తమ దర్శకుడు` విభాగంలో `ఫిల్మ్ ఫేర్`ని అందుకున్న ఈ సినిమా.. `స్పెషల్ జ్యూరీ` (సుధా చంద్రన్) విభాగంలో `జాతీయ పురస్కారాన్ని` సైతం సొంతం చేసుకుంది. హిందీలో `నాఛే మయూరి` (1986) పేరుతో రీమేక్ కాగా.. అందులోనూ సుధా చంద్రన్ ప్రధాన పాత్రలో అభినయించారు. 1985 మార్చి 8న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మయూరి`.. నేటితో 37 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |