![]() |
![]() |

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రోల్స్ కి గురైన సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది 'సన్ ఆఫ్ ఇండియా'. మంచు మోహన్ బాబు నటించిన ఈ సినిమాపై వచ్చినన్ని ట్రోల్స్ ఏ సినిమా మీద వచ్చి ఉండవేమో. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు 'అవతార్ ని మించిన గ్రాఫిక్స్, స్పైడర్ మ్యాన్ ని మించిన కలెక్షన్స్' అంటూ ఒకటే ట్రోల్స్ దర్శనమిచ్చాయి. దానికి తగ్గట్లే సినిమా కూడా పరాజయం పాలైంది. అయితే ఈ సినిమా విషయంలో మోహన్ బాబు తన మాట వినుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్ వేదికగా పరుచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని థియేటర్స్ లో కాకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని తాను మోహన్ బాబుకి చెప్పానని పరుచూరి తెలిపారు. తాను చెప్పినట్లు ఓటీటీలో విడుదల చేసుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని అన్నారు.
సన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని పరుచూరి కొనియాడారు. సూర్య నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'జై భీమ్'ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారని, అదే థియేటర్స్ లో విడుదల చేసుంటే ఇంత పేరు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. అలాగే సన్నాఫ్ ఇండియాని కూడా ఓటీటీలో విడుదల చేస్తే బాగుండేది అన్నారు. ఎప్పుడూ తన మాటని గౌరవించే మోహన్ బాబు.. ఈ సినిమా విషయంలో ఎందుకో వినలేదని పరుచూరి చెప్పుకొచ్చారు.
![]() |
![]() |