![]() |
![]() |

పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంటే సినీ పెద్దలు స్పందించకపోవడం దురదృష్టకరమని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీ నాయకులు కొందరు సినీ పరిశ్రమ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. సినిమా బడ్జెట్ లో హీరో రెమ్యునరేషన్ 10-20 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. సినిమా వ్యాపారం అనేది హీరోల మీదే జరుగుతుందని అన్నారు. సినిమాలకు నష్టం వచ్చినప్పుడు పవన్, చిరంజీవి, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ఇలా ఎందరో హీరోలు వారి రెమ్యునరేషన్ ని వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు.
సినీ పరిశ్రమలో మీకు వ్యక్తిరేకంగా ఉన్న వర్గాల హీరోల ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఏపీ ప్రభుత్వం తీరును నాగబాబు తప్పుబట్టారు. ఏపీలో టికెట్ ధరల వల్ల సినిమాలు నష్టపోతున్నాయని అన్నారు. "ఏపీలో అన్ని వ్యాపారాలను మీరే తీసుకుంటున్నారు కదా, అలాగే సినీ ఇండస్ట్రీని కూడా మీరే తీసుకోండి. వెల్లంపల్లి శ్రీను, కొడాలి నాని వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించండి. అద్భుతంగా నటిస్తారు. మీ దగ్గర మంచి హీరోయిన్సే లేరు. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కే మీకు కొంచెం ఖర్చు అవుతుంది. లేదా ఒక పని చేయండి. అసలు తెలుగు పరిశ్రమని ఏపీలో బ్యాన్ చేయండి. మేం వేరే దారి చూసుకుంటాం. కాస్త ఇబ్బందిపడినా డిజిటల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించుకుంటాం." అని నాగబాబు అన్నారు.
"చిరంజీవి లాంటి పెద్ద మనిషి తన ఆత్మ గౌరవాన్ని తగ్గించుకొని సినీ పరిశ్రమ కోసం మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. మహేష్, ప్రభాస్ కూడా వచ్చారు. మీరేమన్నా మహారాజులా?. మేము మిమ్మల్ని బ్రతిమాలుకోవాలా?. జీవింతాంతం మీరే అధికారంలో ఉండరు. అసలు మీ పాలనలో ఏ వర్గం వారు సంతోషంగా ఉన్నారు చెప్పండి. రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా లేవు. ముందు ప్రజలకు సేవ చేయండి" అని జగన్ సర్కార్ కి నాగబాబు హితవు పలికారు.
మనం భయపడొద్దు, పోరాడదామని నాగబాబు సినీ పరిశ్రమకి సూచించారు. అవసరమైతే జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం మనం ఏపీలో సినిమాలు రిలీజ్ చేయొద్దని, ఓటీటీలో చేద్దామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మనల్ని స్వాగతిస్తోంది. వ్యక్తిగత పగ, ప్రతీకారాలు పట్టించుకోని ప్రభుత్వం అది. కేసీఆర్, కేటీఆర్ మీద మేం గతంలో విమర్శలు చేశాం. కానీ వాళ్ళు మా సినిమాలను అడ్డుకుంటామని ఎప్పుడూ అనలేదు అని నాగబాబు గుర్తుచేశారు.
చిరంజీవి గారికి, మాకు విభేదాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారా అంటూ వైసీపీ నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పెద్ద మనిషి, మంచిగా మాట్లాడతారు. ఆయన వచ్చి మాట్లాడినప్పుడు మీరు సరిగా స్పందించి ఉంటే ఇప్పుడు మేం మాట్లాడాల్సిన పరిస్థితి రాదు. మీతో విభేదించాడని ఆయన తమ్ముడిని టార్గెట్ చేస్తారా? అని నాగబాబు నిలదీశారు.
![]() |
![]() |