![]() |
![]() |

తెలుగునాట రీమేక్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో సీనియర్ స్టార్ రాజశేఖర్ ఒకరు. ఆయన నటించిన రీమేక్ మూవీస్ లో `శేషు` ఒకటి. `చియాన్` విక్రమ్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన తమిళ చిత్రం `సేతు` (1999) ఆధారంగా రూపొందిన ఈ సినిమాతోనే ప్రముఖ నటీమణి, రాజశేఖర్ భార్యామణి జీవితా రాజశేఖర్ దర్శకురాలిగా పరిచయమవ్వడం విశేషం. అలాగే ప్రముఖ నటి కళ్యాణి ఈ చిత్రంతోనే కావేరి పేరుతో తెలుగునాట హీరోయిన్ గా తొలి అడుగేసింది. విషాదాంతపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్, శ్రీమాన్, గణేశ్, జ్యోతిలక్ష్మి, మోహినీ పటేల్, మోహన్ వైద్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ఇక మాతృకకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించగా.. రీమేక్ కి ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా బాణీలందించారు. ఇందులోని 8 పాటల్లో నాలుగు మాతృకలోవే కాగా.. మిగిలిన నాలుగింటిని యువన్ స్వరపరిచారు. గమ్మత్తేమిటంటే.. ఒక్క పాటలో కూడా ఎక్కడా ఫిమేల్ వోకల్స్ వినిపించవు. శివ శివాని మూవీస్ పతాకంపై బేబి శివాని నిర్మాతగా రూపొందిన `శేషు`.. 2002 ఫిబ్రవరి 28న జనం ముందు నిలిచింది. నేటితో ఈ రొమాంటిక్ డ్రామా 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |