![]() |
![]() |

దక్షిణాది అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రాహకుడు ఆర్. రత్నవేలు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన రత్నవేలు, `మ్యూజిక్ మేస్ట్రో` ఇళయరాజా తనయుడు అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చిన యువన్ శంకర్ రాజా.. ఇలా ఈ ఇద్దరు కూడా ఒకే సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 1997లో విడుదలైన ఆ చిత్రమే.. `అరవిందన్`.
శరత్ కుమార్, పార్తిబన్, నగ్మా, ఊర్వశి, ప్రకాశ్ రాజ్, ఆనంద్ రాజ్, విసు ప్రధాన పాత్రధారులుగా 1968 నాటి ఓ వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు టి. నాగరాజన్ రూపొందించిన తమిళ చిత్రం `అరవిందన్`.. 1997 ఫిబ్రవరి 28న జనం ముందు నిలిచింది. అమ్మా క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించిన ఈ చిత్రం కమర్షియల్ గా మెప్పించనప్పటికీ.. రత్నవేలు, యువన్ పనితీరుకి ప్రశంసలు దక్కాయి.
Also Read: 'భీమ్లా నాయక్' ఐదో షోకి గ్రీన్ సిగ్నల్.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం
1999లో `చియాన్` విక్రమ్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన `సేతు`తో రత్నవేలుకి బ్రేక్ దక్కగా.. 2002లో రిలీజైన `తుళ్ళువదో ఇళమై`తో యువన్ దశ తిరిగింది. ఇక తెలుగులో `ఆర్య`తో ఎంట్రీ ఇచ్చిన రత్నవేలు.. ఆనక `ఖైదీ నంబర్ 150`, `రంగస్థలం`, `సైరా నరసింహారెడ్డి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ కెమెరామేన్ అనిపించుకున్నారు. హిందీ, కన్నడ భాషల్లోనూ తనదైన ముద్రవేశారు. ఇక యువన్ విషయానికి వస్తే ఫిబ్రవరి 28నే 2002లో విడుదలైన `శేషు`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆపై `7జీ బృందావన కాలనీ`, `హ్యాపీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `ఓయ్` వంటి తెలుగు చిత్రాలతో ఇక్కడవారిని మెప్పించారు. అలాగే పలు తమిళ అనువాదాలతో అలరించారు. హిందీ, కన్నడ సినిమాలకు సైతం బాణీలందించారు. నేటితో (2022 ఫిబ్రవరి 28) పాతికేళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న రత్నవేలు, యువన్.. భవిష్యత్ లో మరిన్ని విజయాలతో మరింతగా అలరించాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |