![]() |
![]() |

టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాలనీ, కమిట్‌మెంట్‌కు ఒప్పుకోవాలనీ తనపై కొంతమంది ఒత్తిడి తీసుకురావాలని చూశారనీ, అలా చేయకపోతే కెరీర్ ముగిసిపోతుందని కూడా హెచ్చరించారనీ నటి ఎస్తర్ నోరోన్హా వెల్లడించింది. అయితే తను తన పనిని నమ్ముకొని వచ్చాననీ, అందుకే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొనే పని చేయలేదనీ చెప్పింది. కొంత గ్యాప్ తర్వాత ఆమె '#69 సంస్కార్ కాలనీ' అనే విమన్ సెంట్రిక్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పి. సునీల్‌కుమార్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై, అందరి దృష్టినీ ఆకర్షించింది.
"నేను 'భీమవరం బుల్లోడు' చేసేటప్పుడే ఆ తరహా పాత్రలు చాలా వచ్చాయ్. ఆ సినిమా చాలా టైమ్ తీసుకుంది. అది చేసేటప్పుడు నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నాను. ఒకవైపు షూటింగ్, ఇంకోవైపు చదువు.. దాంతో అదో పెద్ద పనిలా ఉండేది నాకు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అన్నట్లుండేది నా పరిస్థితి. నిజానికి అప్పుడు కెరీర్‌పై నాక్కూడా సీరియస్‌నెస్ లేదు. అలాంటి పాత్రలే చెయ్యాలంటే బోర్ అనిపించింది. వేరే రకం క్యారెక్టర్లు వస్తే చెయ్యాలనుకొనేదాన్ని. అయితే అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు నాకు రాలేదు. చేసిన టైపు క్యారెక్టర్లే వచ్చాయి." అని తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్తర్ తెలిపింది.
దాంతో పాటు ఇండస్ట్రీలోని మరో కోణం కూడా తాను ఎదుర్కొన్నాననీ, అది తనకు చాలా చిరాకు, గలీజు అనిపించిందనీ ఆమె చెప్పింది. "నేను ట్రైన్డ్ ఆర్టిస్టుని, ట్రైన్డ్ సింగర్‌ని, ట్రైన్డ్ డాన్సర్‌ని. ఒక గుడ్ టెక్నీషియన్‌తో లాంచ్ అయ్యాను. హెల్దీ టీమ్‌తో, హెల్దీ ఎట్మాస్ఫియర్‌తో, ప్రొఫెషనల్ టీమ్‌తో వర్క్ చేయాలని అనుకున్నాను. మంచి టెక్నీషియన్స్‌తో చాలెంజింగ్‌గా వర్క్ చేయాలని అనుకున్నాను. అలాంటి మైండ్‌సెట్‌తో నేనుంటే, నా దగ్గరకు వచ్చిన కొంతమంది మాట్లాడే తీరే వేరేలా అనిపించింది. కాంప్రమైజ్ కావాలని చెప్పారు. నేను ఎందులోనైనా వీక్ అయినప్పుడు, అందులో ఎవరైనా ఫేవర్ చేస్తే, దానికి బదులుగా ఏదైనా చెయ్యడంలో అర్థముంది. కానీ నేను బాగా చేస్తున్నప్పుడు నేనెందుకు కాంప్రమైజ్ కావాలి?" అని ఆమె ప్రశ్నించింది.

మీరిలాగే ఉంటే పనికాదు, మీ కెరీర్ ఇక్కడితో ఆగిపోతుంది, వాళ్ల దగ్గరకు వెళ్లకపోతే మీరు ముందుకు వెళ్లలేరు, కొంచెం తగ్గుతూ ఉండాలని వారు చెప్పారని ఎస్తర్ వెల్లడించింది. "ఎవరికేం కావాలో మనిషిని చూసి బిహేవ్ చేయడం నేర్చుకో అంటూ చెప్పుకొచ్చేవారు. ఇంతకుముందు ఫలానావాళ్లు ఇలాగే చేస్తే వాళ్ల కెరీర్ అయిపోయింది. నువ్వూ ఇలాగే చేస్తే, నీ తర్వాత వచ్చినవాళ్లు ఎక్కడికో వెళ్లిపోతారు, ఆమె ఎంత స్మార్ట్‌గా చేస్తుందో చూడు అని చెప్పేవారు. డైరెక్టుగా నన్ను ఫోర్స్ చెయ్యలేదు కానీ, వాళ్ల మాటల్ని బట్టి ఏం చెప్తున్నారో అర్థమైపోయేది. నన్ను మెంటల్‌గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారని తెలిసిపోయేది. అవసరం ఉండీ, ఏదో ఒత్తిడితో ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిని కాదు. నటన అనేది నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. నాకు పేరు సంపాదించుకోవాలనే డెస్పరేషన్ కానీ, మనీ కావాలనే డెస్పరేషన్ లేదు. ఒక సినిమా కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవాలా అనుకున్నాను." అని ఆమె తెలిపింది.
సినిమా అనేది తన జీవితంలో ఓ భాగం మాత్రమేనేది ఆమె మాట. "అదే నా జీవితం కాదు. నా జీవితంలో కేంద్ర కూడా కాదు. అందుకని వాళ్లు చెప్పిన పని చేయాల్సిన అవసరం లేదు, చూద్దాం అనుకున్నాను. కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడైనా పని దొరుకుతుందనుకున్నాను." అని చెప్పుకొచ్చింది ఎస్తర్.
![]() |
![]() |