Home  »  News  »  తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న మోహన్ బాబు!

Updated : Feb 15, 2022

టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవరంటూ కొంతకాలంగా చర్చ జరుగుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఎవరు? అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవే ప్రస్తుతం తమ పెద్ద అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆయన తర్వాత పెద్ద ఎవరూ లేరని చెబుతూ వచ్చింది. చిరంజీవి సైతం తాను సినీ పెద్దని కాదని, సినీ బిడ్డని అని చెప్పుకున్నారు. అయితే ఇటీవల టికెట్ ధరల విషయంలో చిరంజీవి పెద్దగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించడంతో 'సినీ పెద్ద ఎవరు?' అనే అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇలాంటి సమయంలో 'మోహన్ బాబే సినీ పరిశ్రమకు పెద్దన్న' అంటూ సీనియర్ యాక్టర్ నరేష్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మోహన్‌ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'సన్నాఫ్‌ ఇండియా' ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న.. అన్న మోహన్‌ బాబు. గొప్ప హీరోలు ఉన్నారు, గొప్ప విలన్లు ఉన్నారు, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. కానీ అన్నీ కలిపి ఒకరుంటే అది మోహన్ బాబు గారు. ఇది చరిత్ర ఉన్నంత కాలం మారదు. సినిమా కోసం బతికే వ్యక్తి కాదు.. సినిమా కోసం పుట్టిన వ్యక్తి మోహన్ బాబు. రైతు కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నటుడు మోహన్‌ బాబు. మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన మన గర్వకారణం. పదిమందికి భోజనం పెట్టే ఈ కుటుంబం బాగుండాలి" అంటూ మోహన్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు నరేష్.

సినీ పెద్ద ఎవరు అంటూ చర్చలు జరుగుతున్న సమయంలో 'తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న' అంటూ మోహన్ బాబుని ప్రశంసిస్తూ నరేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.