![]() |
![]() |

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, 'ఘోస్ట్‌బస్టర్స్' లాంటి బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఇవాన్ రీట్‌మ్యాన్ మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. 1946లో చెకొస్లొవేకియాలో జన్మించిన ఇవాన్ చిన్నప్పుడే తల్లితండ్రులు కెనడాలోని టోరంటోకు తరలి వెళ్లారు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టిన ఇవాన్ 1971లో 'ఫాక్సీ లేడీ' మూవీతో డైరెక్టర్‌గా మారారు. దాని ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమా హారర్ స్పూఫ్ అయిన 'కానిబల్ గాళ్స్'.
ఇక 'ఘోస్ట్‌బస్టర్స్' (1984) మూవీతో ఆయన పేరు విశ్వవ్యాప్తమైంది. ఐక్రాయిడ్, ముర్రే, ఎర్నీ హడ్సన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని నిర్మించి, డైరెక్ట్ చేశారు ఇవాన్. సాలిడ్ స్క్రిప్టుకు మంచి యాక్టర్లు తోడైతే ఎలాంటి సినిమా వస్తుందనేందుకు 'ఘోస్ట్‌బస్టర్స్' ఒక తార్కాణంగా నిలిచింది. ఆ సినిమా సాధించిన అపూర్వ విజయంతో 1989లో సీక్వెల్ 'ఘోస్ట్‌బస్టర్స్ 2' తీశారు ఇవాన్. అది కూడా పెద్ద హిట్టయింది.
డైరెక్టర్‌గా కంటే ప్రొడ్యూసర్‌గా ఎక్కువ సినిమాలు తీశారు ఇవాన్ రీట్‌మ్యాన్. వాటిలో గత ఏడాది వచ్చిన 'ఘోస్ట్‌బస్టర్స్: ఆఫ్టర్ లైఫ్' కూడా ఉంది. దీనికి ఆయన కుమారుడు జాసన్ రీట్‌మ్యాన్ దర్శకత్వం వహించడం గమనార్హం.
![]() |
![]() |