![]() |
![]() |

గతేడాది యంగ్ హీరోల సినిమాలు 'ఉప్పెన', 'జాతి రత్నాలు' కలెక్షన్ల వర్షం కురిపించి సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది మరో యంగ్ హీరో సినిమా సత్తా చాటుతోంది. ఈ నెల 12 న 'డీజే టిల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి సంచలన విజయం అందుకునే దిశగా దూసుకుపోతున్నాడు.
టీజర్, ట్రైలర్ తో 'డీజే టిల్లు'పై మంచి బజ్ ఏర్పడింది. దాదాపు రూ.9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు.. రూ.9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బరిలోకి దిగింది. మొదటి రెండు రోజుల్లో అంచనాలకు మించి కలెక్ట్ చేసిన ఈ సినిమా చాలా ఏరియాల్లో అప్పుడే లాభాల బాట పట్టింది. మొదటి రోజు రూ.4 కోట్ల షేర్ తో సత్తా చాటిన డీజే టిల్లు రెండో రోజు రూ.3.50 కోట్లు రాబట్టింది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.7.50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ క్లీన్ హిట్ కి రూ.2 కోట్ల దూరంలో నిలిచింది. మరో పదిరోజుల పాటు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు సంచలనాలు సృష్టించే అవకాశముంది.

నైజాం ఏరియాలో రూ.2.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు రెండు రోజుల్లోనే రూ.3 కోట్లు కలెక్ట్ చేసి లాభాల బాట పట్టింది. అలాగే ఓవర్సీస్ లో రూ.0.65 కోట్ల బిజినెస్ ఈ మూవీ అప్పుడే రూ.1.25 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డీజే టిల్లు' ఆకట్టుకుంటోంది. ఫస్టాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త వీక్ గా ఉన్నా.. ఓవరాల్ గా సినిమా అలరిస్తుండటంతో ప్రేక్షకులు డీజే టిల్లుకి ఓటేస్తున్నారు. డీజే టిల్లు బాక్సాఫీస్ హవా ఇలాగే కొనసాగితే 'ఉప్పెన', 'జాతి రత్నాలు' సినిమాల స్థాయి విజయాన్ని అందుకోవడంలో సందేహం లేదు.
![]() |
![]() |