![]() |
![]() |

కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు చేసి, హీరో అయిన శ్రీకాంత్.. ఆమధ్య నాగచైతన్య సినిమా 'యుద్ధం శరణం'లో విలన్‌గా నటించారు. అందులో బాగా చేశాడని విమర్శకులు మెచ్చినా, ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆయన నటనకు అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ' మూవీలో వరదరాజులు అనే భయంకరంగా కనిపించే విలన్ రోల్‌తో ఆయన మనముందుకు వస్తున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
"కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. 'యుద్ధం శరణం' అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. 'సరైనోడు' సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. 'మంచి విలన్ పాత్రను రాస్తాను, వేస్తారా?' అని అడిగారు. 'నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా' అని అన్నాను." అని మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా చెప్పారు శ్రీకాంత్.
అలా కొన్ని రోజులు ఎదురుచూశాక 'అఖండ' కోసం విలన్ పాత్రను వినిపించారు బోయపాటి. "విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను. నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వారికి కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది." అని ఆయన అన్నారు.
బాలయ్యతో ఆయన 'శ్రీరామరాజ్యం' సినిమాలో నటించారు. "అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి గారికి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది. 'ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను' అని బాలకృష్ణ అనేవారు." అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
![]() |
![]() |