![]() |
![]() |

తెలుగునాట తనదైన రాతతో, తీతతో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తొలుత రచయితగా, ఆనక దర్శకుడిగా స్టార్ డమ్ చూసిన త్రివిక్రమ్.. టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తరువాత కూడా అడపాదడపా వేరే దర్శకులు రూపొందిస్తున్న చిత్రాలకు సంభాషణలు అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `భీమ్లా నాయక్` కూడా ఈ తరహా చిత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె. చంద్ర దర్శకుడు కాగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో రీమేక్స్ ఉన్నాయి. `నిన్నే ప్రేమిస్తా`, `నువ్వే కావాలి`, `తీన్ మార్`.. ఈ జాబితాలోవే. తమిళ చిత్రం `నీ వరువాయ్ ఏన` ఆధారంగా `నిన్నే ప్రేమిస్తా` రూపొందితే.. మలయాళ సినిమా `నిరమ్`కి రీమేక్ వెర్షన్ గా `నువ్వే కావాలి` తెరకెక్కింది. ఇక హిందీ చిత్రం `లవ్ ఆజ్ కల్`కి రీమేక్ గా `తీన్ మార్` తయారైంది. ఈ రీమేక్స్ లో `నువ్వే కావాలి` మాత్రమే సంచలనం సృష్టించింది. మరి.. `నువ్వే కావాలి` లాగే మాలీవుడ్ రీమేక్ గానే రూపొందుతున్న `భీమ్లా నాయక్` కూడా త్రివిక్రమ్ సంభాషణలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. కాగా, 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న `భీమ్లా నాయక్` రిలీజ్ కానుంది.
![]() |
![]() |