![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చను, రసాభాసను మర్చిపోకముందే ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం రాజుకుంటోంది. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె.వి.ఆర్ చౌదరి ఇద్దరు సభ్యుల నామినేషన్స్‌ను తిరస్కరించడం వివాదానికి, చర్చకు దారి తీసింది.
సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి అనర్హుడంటూ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. దీనికి కారణం ప్రభు ప్రస్తుతం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉండటం. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా అసోసియేషన్ పదవిలో ఉన్నట్లయితే దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదు అనే నిబంధన ఉందనే సాకుతో తన నామినేషన్‌ను కె.వి.ఆర్. చౌదరి తిరస్కరించారనీ, అసలు అలాంటి నిబంధన ఏదీ అసోసియేషన్ బైలాలో లేకపోయినప్పటికీ ఎన్నికల అధికారి చౌదరి కొందరు వ్యక్తుల వత్తిడికి తలవోగ్గి ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ ను తిరస్కరించారన్నది ప్రభు ఆరోపణ.
అయితే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లో దేనికీ సంబంధించినది కాదు. అది ఫిల్మ్ జర్నలిస్టులకు సంబంధించిన అసోసియేషన్. ఫిల్మ్ జర్నలిస్టులు సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టుల్లో దేనికీ సంబంధించినవారు కాదనేది గమనార్హం.
అలాగే మరొక సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం ఉందని, మినిట్స్ బుక్‌లోని రిసొల్యుషన్స్ ను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన గత కమిటీకి రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి కొమ్ముకాస్తున్నారని మద్దినేని రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అలాగే జర్నలిస్ట్ ప్రభు కూడా తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన కారణం అప్రజాస్వామికంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది.
![]() |
![]() |