![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణ వార్త విని కొందరి గుండెలు ఆగిపోగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిద్రాహారాలు మాని పునీత్ నే తలుచుకుంటూ కన్నుమూసిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా పునీత్ అభిమానులు 10 మందికి పైగా మృతిచెందారు. ఈ క్రమంలో పునీత్ సతీమణి అశ్విని స్పందించారు. అభిమానులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
పునీత్ అభిమానుల ఆత్మహత్య ఘటనలపై అశ్విని స్పందిస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. "అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న అభిమానానికి మేం ఎప్పటికి రుణపడి ఉంటాం. అప్పు ఎప్పుడూ అభిమానులు సంతోషంగా ఉండాలని కోరుకునే వారు. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పు మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయనే లేని లోటును మేము అనుభవిస్తున్నాం. మీ కుటుంబాలకు అలాంటి పరిస్థితి రానివ్వకండి. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాన్ని ఒంటరి చేయవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు దైర్యంగా ఉండండి.. ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు" అని అశ్విని విజ్ఞప్తి చేశారు.
'మీ కుటుంబాలకు మా కుటుంబం లాంటి పరిస్థితి రానివ్వకండి' అంటూ అశ్విని ఆవేదనతో చేసిన విజ్ఞప్తితో అయినా పునీత్ అభిమానులు తమ కుటుంబం గురించి ఆలోచించి ఆత్మహత్య ఆలోచనను రానివ్వరని ఆశిద్దాం.
![]() |
![]() |