![]() |
![]() |

హీరో నాగశౌర్య కుటుంబానికి చెందిన రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పేకాట దందాపై స్పెషల్ ఆపరేషన్ పోలీసులు (SOT) ఆదివారం రాత్రి దాడిచేసి, జూదం ఆడుతున్న 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షల రూపాయల నగదును, కార్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రంతా వారిని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈరోజు వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చనున్నారు.
పోలీసుల విచారణలో గుత్తా సుమంత్ ఈ ఫామ్‌హౌస్‌లోనే కాకుండా హైదరాబాద్ శివార్లలోని పలు ఫామ్‌హౌస్‌లలో ఇదే రకమైన పేకాట దందాను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ కేసులో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు బయటకు వచ్చింది. ఈ ఫామ్‌హౌస్ లీజుదారునిగా నాగశౌర్య తండ్రి శంకర్‌ప్రసాద్ ఉండగా, దాని వ్యవహారాలన్నీ బుజ్జి చూసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని వినిపిస్తోంది.
నాగశౌర్య సొంత ప్రొడక్షన్ కంపెనీ ఐరా క్రియేషన్స్ వ్యవహారాలు కూడా బుజ్జి చూసుకుంటున్నారు. శౌర్యకు బాబాయ్‌తో మంచి అనుబంధం ఉంది కూడా. ఇప్పుడు వారి ఫామ్‌హౌస్ గాంబ్లింగ్ డెన్‌గా మారడం, గుత్తా సుమంత్ అనే వ్యక్తి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు తేలడం, తెరపైకి బుజ్జి పేరు కూడా రావడంతో.. ఇండస్ట్రీ దృష్టి ఈ కేసుపైకి మళ్లింది. ఫామ్‌హౌస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |