![]() |
![]() |

"ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు" అని 'అత్తారింటికి దారేది' సినిమాలో అంటాడు ఎమ్మెస్ నారాయణ. ఆ మాటల్ని పవన్ కల్యాణ్ కంటే మహేశ్ బాగా వంటపట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు 'శ్రీమంతుడు' విడుదల విషయంలో చేసిందే, మరోసారి 'సర్కారువారి పాట' రిలీజ్ విషయంలో మహేశ్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 2022లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 13న 'సర్కారువారి పాట'ను విడుదల చేయాలని నిర్మాతలు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారవచ్చునని వినిపిస్తోంది.
గతంలో 'శ్రీమంతుడు' సినిమా విషయంలోనూ మహేశ్‌బాబు వెనక్కి తగ్గి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పుడు మొదట 2015 జూలై 17న 'శ్రీమంతుడు'ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. అయితే ప్రభాస్‌తో రాజమౌళి తీసిన 'బాహుబలి'ని జూలై 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో వారు షాకయ్యారు. 'బాహుబలి' పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో మిగతా భాషలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ డేట్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని ఆ మూవీ నిర్మాతలు చెప్పడంతో, 'శ్రీమంతుడు' రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేయడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆగస్ట్ 7న విడుదలైన 'శ్రీమంతుడు' మహేశ్ కెరీర్‌లోనే అప్పటికి హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఇప్పుడు మరోసారి అదే స్థితి 'సర్కారువారి పాట' విషయంలోనూ మహేశ్‌కు ఏర్పడింది. రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు 2022 జనవరి 7ను రిలీజ్ డేట్‌గా ఎంచుకుంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా, మిగతా సినిమాల కలెక్షన్లపై పెను ప్రభావం పడుతుందనే విషయంలో ఎవరికీ డౌట్లు లేవు. కానీ, అప్పటికే 2022 సంక్రాంతికి 'భీమ్లా నాయక్' (జనవరి 12), 'సర్కారువారి పాట' (జనవరి 13), 'రాధే శ్యామ్' (జనవరి 14), 'బంగార్రాజు' (జనవరి 15) సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు.
ఇది తెలిసి కూడా 'ఆర్ఆర్ఆ'ర్ మూవీని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య అనౌన్స్ చేశారు. దీంతో ఆ నాలుగు సినిమాల నిర్మాతలూ షాక్ తిన్నారు. సంక్రాంతి సీజన్ అనేది బాక్సాఫీస్ పరంగా ఎంత కీలకమైందో తెలిసిందే. దాన్ని నమ్ముకొని తాము సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే, 'ఆర్ఆర్ఆర్' వచ్చి ఆ ఆశలకు గండికొడుతోందనేది వారి ఆందోళన. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి, జనవరి 7 తమకు అన్నివిధాల అనుకూలంగా ఉంటుందనేది దానయ్య వాదన. అప్పుడైతే డిస్ట్రిబ్యూటర్లు సహా ఆ సినిమా బిజినెస్‌పై ఆధారపడిన వారందరూ సేఫ్ అవుతారని ఆయన భావన.
దీంతో మరోసారి రాజమౌళి కోసం మహేశ్ వెనక్కి తగ్గనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకొని, మరో సేఫ్ డేట్ కోసం 'సర్కారువారి పాట' నిర్మాతలు అన్వేషిస్తున్నారు. నిజానికి తమ సినిమా ఫెస్టివల్ సీజన్‌లో అయితే ఆడియెన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోందని వారు అనుకున్నారు. త్వరలోనే 'సర్కారువారి పాట' రిలీజ్ డేట్ గురించిన అనౌన్స్‌మెంట్ రావచ్చని తెలుస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో మహేశ్ పెయిర్‌గా ఫస్ట్ టైమ్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ మూవీతో వరుసగా నాలుగో హిట్‌పై మహేశ్ కన్నేశాడు.
![]() |
![]() |