![]() |
![]() |

తెలుగునాట అత్త - అల్లుడు సవాళ్ళ చుట్టూ తిరిగే కథలు.. బాక్సాఫీస్ ఎవర్ గ్రీన్ ఫార్ములా అనే చెప్పాలి. ఆ తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో `అల్లరి అల్లుడు` ఒకటి. కింగ్ నాగార్జున టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అత్తగా కళాభినేత్రి వాణిశ్రీ నటించగా.. నగ్మా, మీనా నాయికలుగా అభినయించారు. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రావుగోపాల రావు, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, సంగీత, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, గుండు హనుమంత రావు, రాళ్ళపల్లి, సుత్తి వేలు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రమ్యకృష్ణ ఓ ప్రత్యేక గీతం కోసం నాగ్ తో కలిసి చిందులేశారు.
స్వరవాణి కీరవాణి బాణీలు `అల్లరి అల్లుడు`కి ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``నిన్ను రోడ్డు మీద`` చార్ట్ బస్టర్ గా నిలవగా - ``రైక చూస్తే``, ``మచిలీపట్నం``, ``కమ్మని ఒడి బొమ్మని``, ``ఒక్కసారే వన్స్ మోరే``, ``ఛలో నా చక్కెర కేళి``, ``తొడ తొక్కిడి`` కూడా మాస్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామాక్షీ ఆర్ట్ మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం.. కన్నడంలో `గడిబిడి అళియ` (శివరాజ్ కుమార్, మాలాశ్రీ, మోహిని) పేరుతో రీమేక్ అయింది. 1993 అక్టోబర్ 6న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అల్లరి అల్లుడు`.. నేటితో 28 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |