![]() |
![]() |

టాలీవుడ్‌లో ప్రకాశ్‌రాజ్ కనీసం ఒక్క సినిమా కూడా నిర్మించలేదని హీరో మంచు విష్ణు తెలిపారు. "కానీ మా డబ్బులు మాత్రం కావాలి.. కానీ ఆయన డబ్బులు మాత్రం ఇక్కడ పెట్టడు" అంటూ ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు నిప్పులు చెరిగారు.
అయితే ప్రకాశ్ రాజ్.. ఇక్కడే ఉండి.. అన్నీ ఇక్కడే చేసి ఉంటే.. గ్యారెంటీగా ఆయన్ని ఒప్పుకునే వాళ్లమన్నారు. "పోనీ అలా ఉండి.. ప్రకాశ్‌రాజ్ ఆన్‌టైమ్‌కు ఎప్పుడైనా షూటింగ్‌కు వెళ్లారా?" అని ప్రశ్నించారు. "ప్రొడ్యూసర్లను బాధపెట్టలేదా? రెండు సార్లు సస్పెండ్ అవ్వలేదా?" తదితర ప్రశ్నలను ప్రకాశ్‌రాజ్‌కు మంచు విష్ణు సంధించారు.
చిత్ర సీమకు చెందిన నిర్మాతలు, దర్శకులంతా తాను గెలవాలని ఫోన్లు చేస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో ఉన్న అధిక శాతం సభ్యులు తనకు చాలా క్లోజ్ అని... ప్రకాశ్‌రాజ్ వైఖరితో వారంతా విసిగిపోయారని చెప్పారు. ప్రకాశ్‌రాజ్ కేవలం పొలిటికల్ అజెండాతో మాత్రమే ఇదంతా చేస్తున్నారన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. 'రిపబ్లిక్' ఆడియో ఫంక్షన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు. తామంతా అద్దాల మేడలో ఉన్నామని.. తాము ఒకరిపై రాయి వేసిన ఒకరు తమపై రాయి వేసిన తమకే నష్టమన్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు అధికారంలో ఉన్నా.. వారితో రాయబారాలు చేసుకోవడానికి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉంటారన్నారు.
పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన వ్యక్తిగతం అంటూ వెంటనే ఇండస్ట్రీ పెద్దలు స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా మంచు విష్ణు గుర్తు చేశారు. ఆ క్రమంలోనే 'మీరు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా?' అన్న ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్ కంగారు పడిపోయి.. ఇప్పటి వరకు ఆయన వైపు నుంచి జవాబు రాలేదని మంచు విష్ణు ఎద్దేవా చేశారు.
'మా' అనేది సర్వీస్ మోటో కోసమేనని.. అంతేకాని చారిటీ కాదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. దీనిపై అజ్జానులు చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అక్టోబర్ 10వ తేదీన 'మా' ఎన్నికలు అయిన తర్వాత కౌంటర్ ఇస్తానని మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు స్పందించారు. అయితే తన తండ్రి మోహన్ బాబు కౌంటర్ తనను ఇబ్బంది పెట్టదన్నారు. ఈ అంశంపై తన తండ్రి మోహన్ బాబు మాట్లాడితే.. తనకు అడ్వర్‌టైజ్‌మెంట్ అవుతుందనీ, ఈ ఎలక్షన్ వన్ సైడ్ అయిపోతుందనీ అన్నారు మంచు విష్ణు. 'మా' ఎన్నికలు.. వాటి ఫలితాల వల్ల తమకు దసరా పండగ 100 శాతం ముందే వస్తుందని మంచు విష్ణు వెల్లడించారు.
ఇండస్ట్రీ ఆశీస్సులతో తాను గెలుస్తానని మంచు విష్ణు బల్లగుద్దిమరీ చెప్పారు. జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి లాంటి వాళ్లకు, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లకు మధ్య తేడాను మంచు విష్ణు క్లారిటీగా వివరించారు.
![]() |
![]() |