![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే ఆదివారం, అక్టోబర్ 10న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్త అధ్యక్ష కార్యదర్శులతో పాటు, మిగతా ఆఫీస్ బేరర్స్‌ను నటీనటులు ఎన్నుకోనున్నారు. కన్నడ సీనియర్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్, తెలుగు యువ కథానాయకుడు మంచు విష్ణు ప్యానళ్లు మా ఎన్నికల బరిలో నిలుచున్నాయి. విష్ణు కంటే చాలా ముందుగా, పెద్ద ప్రణాళికతో పావులు కదుపుతూ, మెగా శిబిరం మద్దతు కూడగట్టుకొని - పాపులర్ యాక్టర్లతో ప్యానల్‌ను ప్రకటించారు ప్రకాశ్‌రాజ్.
ఆయన ఎత్తులు, ముందస్తు ప్రణాళిక, ఆయన మద్దతుగా పలురువు నటులు మాట్లాడటంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చరిత్రలోనే తొలిసారి ఒక కన్నడ యాక్టర్ ప్రెసిడెంట్ కాక తప్పదనే అభిప్రాయం, నమ్మకం ఇండస్ట్రీలో వ్యక్తమైంది. ఆ తర్వాత మంచు విష్ణు కూడా తన ప్యానల్‌ను ప్రకటించారు. ఆయన ప్యానల్‌లో సీనియర్, యంగ్ ఆర్టిస్టుల సమ్మేళనం కనిపించింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలోని పలువురు సీనియర్ ఆర్టిస్టులు ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా విష్ణుకు అండగా నిలిచేందుకు ఒక్కటి అవుతున్నారని బలంగా వినిపిస్తోంది. తెలుగు నటీనటుల సంఘమైన 'మా' పెత్తనాన్ని ఒక కన్నడ నటుడిగా అప్పగించడమేంటని వారు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే వారు ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని మిగతా అభ్యర్థులు గెలిచినా ఫర్వాలేదు కానీ, అధ్యక్షుడిగా మాత్రం ప్రకాశ్‌రాజ్ ఎన్నిక కాకూడదని కోరుకుంటున్నారు. అధ్యక్షుడిగా తమ ఓటును విష్ణుకు వేయడానికే వారు నిర్ణయించుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు యంగ్ హీరోలు సైతం విష్ణు వైపే నిలుస్తున్నారు. విష్ణుకు నేటి తరంలోని హీరోల్లో అత్యధికులు ఫ్రెండ్స్. అలాగే మిగతా యంగ్ యాక్టర్లతోనూ విష్ణుకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందువల్ల వారు కూడా విష్ణుకు అండగా నిలుస్తామని మాట ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రెండు ప్యానళ్లలో ఏ ఒక్కటీ స్వీప్ చేసే చాన్స్ లేదు. అధ్యక్షుడిగా మాత్రం ప్రకాశ్‌రాజ్ అంత ఈజీగా గెలిచే అవకాశమైతే లేదనీ, నిజానికి ఆయన కంటే విష్ణుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సినీ పెద్దలు అంటున్నారు.
![]() |
![]() |