![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. మా అధ్యక్ష పోరు ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య జరగనుంది. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మంచు విష్ణు అయితే వరుసగా సినీ పెద్దలను కలుస్తూ తన ప్యానల్ కు మద్దతు పెంచుకునే పనిలో ఉన్నారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగా మద్దతు ఉందని మొదటి నుండి వినిపిస్తున్న మాట. దీంతో మిగతా సినీ పెద్దల మద్దతు కోసం మంచు విష్ణు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న విష్ణు.. ఆదివారం నాడు నటసింహం బాలకృష్ణను కలిశారు. 'మా ఎన్నికల సమయంలో నాకు అండగా ఉంటున్న బాల అన్నకు ధన్యవాదాలు' అంటూ బాలకృష్ణతో దిగిన ఫోటోలను విష్ణు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇక ఈరోజు(సోమవారం) రెబల్ స్టార్ కృష్ణంరాజును కూడా కలిశారు విష్ణు. కృష్ణంరాజుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విష్ణు.. 'ఒరిజినల్ రెబల్ స్టార్ ఆశీర్వాదం తీసుకున్నాను' అని పోస్ట్ చేశారు.
మొత్తానికి మంచు విష్ణు సీనియర్స్ మద్దతుతో మా ఎన్నికల్లో గెలవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
![]() |
![]() |