![]() |
![]() |

కింగ్ నాగార్జునని కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన చిత్రం `నిన్నే పెళ్లాడతా`(1996). హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ మ్యూజికల్ సెన్సేషన్ నేటి(అక్టోబర్ 4)తో పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
* నాగ్, టబు హీరోహీరోయిన్లుగా నటించిన మొదటి సినిమా ఇది. అంతకుముందు `సిసింద్రీ`(1995)లో ఈ ఇద్దరూ `ఆటాడుకుందాం..రా!` అంటూ సాగే పాటలో కలిసి నర్తించారు. `నిన్నే పెళ్లాడతా`లో శీనుగా నాగ్, మహాలక్ష్మిగా టబు పోటీపడి మరీ నటించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఆపై నాగ్, టబు `ఆవిడా మా ఆవిడే` (1998)లో కలిసి నటించారు.
* సంగీత దర్శకుడు సందీప్ చౌతాకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం కోసం సందీప్ స్వరపరిచిన గీతాలన్నీ అప్పట్లో సంచలనం సృష్టించాయి. మరీముఖ్యంగా.. ``గ్రీకువీరుడు``, ``ఎటో వెళ్ళిపోయింది మనసు``, ``కన్నుల్లో నీ రూపమే`` చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం తరువాత నాగ్, సందీప్ కాంబినేషన్ లో `చంద్రలేఖ` (1998), `సూపర్` (2005), `కేడి` (2010) వచ్చాయి. ఇవన్నీ మ్యూజికల్ గా మెప్పించినా కమర్షియల్ గా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
* `గులాబి`(1995)తో దర్శకుడైన కృష్ణవంశీకి రెండో చిత్రమైన `నిన్నే పెళ్లాడతా` ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. ఇప్పటికీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. `నిన్నే పెళ్లాడతా` తరువాత నాగ్, కృష్ణవంశీ కాంబోలో `చంద్రలేఖ` వచ్చింది. అయితే, `నిన్నే పెళ్లాడతా`లా మ్యాజిక్ చేయలేకపోయింది.
* తమిళంలో `ఉన్నైయే కళ్యాణం పణ్ణిక్కిరేన్` పేరుతో అనువాదమైన `నిన్నే పెళ్లాడతా`.. అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
* `నిన్నే పెళ్లాడతా` 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమైంది.
* `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటి`, `ఉత్తమ దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్`.. `ఉత్తమ ప్రాంతీయ చిత్రం` (తెలుగు)గా `జాతీయ పురస్కారం` అందుకున్న `నిన్నే పెళ్లాడతా`.. `బెస్ట్ హోమ్-వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ మేల్ సింగర్` (రాజేశ్) విభాగాల్లో `నంది` పురస్కారాలు దక్కించుకుంది.
* కన్నడంలో ఈ సినిమా `ప్రీతిసోద్ తప్ప` (రవిచంద్రన్, శిల్పా శెట్టి) పేరుతో రీమేక్ అయి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
![]() |
![]() |