![]() |
![]() |
.jpg)
మనకు సినీ తార బాహ్యముఖమే తెలుసు. ఆమె అంతర్ముఖం ఎలా ఉంటుందో తెలియదు. వెలుగుజిలుగుల మధ్య, గ్లామరస్‌గా కనిపించే తార అంటే మనకో ఇమేజ్ ఉంటుంది. వాళ్లు వేరే లోకం వాళ్లన్న అభిప్రాయమూ ఏర్పడుతుంది. అయితే మిగతా అందరిలానే వాళ్లకూ స్నేహితులు ఉంటారనీ, వాళ్లకూ ఓ కుటుంబం ఉంటుందనీ, వాళ్ల జీవితాల్లోనూ మరపురాని క్షణాలుంటాయనీ, వాటిని స్వచ్ఛంగా ఆస్వాదిస్తుంటారనీ హీరోయిన్ రెజీనా కసాండ్రా లైఫ్‌ను చూస్తే మనకు అర్థమవుతుంది.
రెజీనా స్వస్థలం చెన్నై. అక్కడే పుట్టి పెరిగింది. అక్కడి విమెన్స్ క్రిస్టియన్ కాలేజీ (డబ్ల్యుసీసీ)లో బీయస్సీ సైకాలజీ చేసింది. కాలేజీ వదిలిన ఐదేళ్ల తర్వాత అక్కడ జరిగిన కల్చరల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లడం ఆమె మర్చిపోలేని విషయం. అప్పటికే ఆమెకు నటిగా మంచి పేరొచ్చేసింది. ఆ రోజు ఆమెకు ఎంత ఆనందంగా గడిచిపోయిందో! ప్రిన్సిపాల్, లెక్చరర్స్ చూపించిన ఆప్యాయతకు కళ్లు చెమర్చాయి. నిజానికి కాలేజీలో ఆమె బాగా అల్లరి చేసేది. ఐదేళ్ల తర్వాత ఆమెను చూసి రెజీనా కంటే వాళ్లే ఎక్కువ ఆనందపడ్డారు. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే రెజీనా కళ్లూ తడయ్యాయి. అయితే అవి ఆనందబాష్పాలు. ఆ క్షణాల్ని ఎలా వర్ణించాలో ఆమెకు తెలీలేదు.
ఆమె అతిథిగా వెళ్లిన ప్రోగ్రామ్ పూర్తయి, వేరే ప్రోగామ్ జరుగుతున్నా, కదలాలనిపించక అక్కడే ఉండిపోయింది. ఎవరి జీవితంలోనైనా కాలేజీ లైఫ్ అంత మధురమైన దశ ఇంకోటి ఉండదని ఎందుకంటారో ఆ క్షణాన ఆమెకు అనుభవంలోకి వచ్చింది. వాళ్ల ప్రిన్సిపాల్ ‘‘ఏంటే నువ్వు ఇలా తయారయ్యావ్? ఈ సల్వార్ ఏమిటి? ఈ జుట్టేమిటి? ఈ మేకప్పేమిటి? నిజంగా సెలబ్రిటీ అనిపించావ్’’ అని ఆశ్చర్యపోయింది. అప్పట్లో కాలేజీకి రెజీనా షర్ట్, జీన్సలోనే వెళ్లేది. చాలా కాజువల్‌గా కనిపించేది.

"నేను మన సంప్రదాయాల్ని గౌరవిస్తాను. మనకు తెలీని అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతాను. చర్చికి వెళ్తుంటాను. సహ జీవనంలో నాకు నమ్మకం లేదు. అందరి సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిలో ఎంత ఆనందం, సందడి ఉంటాయి! అలాంటి సందడిని నేను ఇష్టపడతాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు కానీ పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లాలనేది నా కోరిక. అక్కడ తోడి కోడళ్లు, ఆడబిడ్డలు, మరుదులు వంటివాళ్లంతా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. మాది చిన్న కుటుంబం కాబట్టి ఇలాంటి కోరిక ఏర్పడిందేమో తెలీదు. జగమంత కుటుంబానికి కోడలు అయితే బావుంటుందన్నది నా ఆశ." అని చెప్పుకొచ్చింది రెజీనా.
![]() |
![]() |