![]() |
![]() |
.jpg)
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు 151 చిత్రాలతో సందడి చేశారు. వాటిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే, ఆ సినిమాలన్నింటిలోనూ `చంటబ్బాయ్`కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ `చంటబ్బాయ్` స్పెషాలిటీ ఏంటంటే.. చిరు బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ఏకైక చిత్రమిది.
ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యాల నిర్దేశకత్వంలో రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన `చంటబ్బాయ్` నవల ఆధారంగా తెరకెక్కింది. యూనివర్శల్ డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేసే డిటెక్టివ్ పాండురంగారావు.. జేమ్స్ బాండ్ లా ఫీలైపోయి `జేమ్స్ పాండ్`గా పేరు మార్చుకుని ఎలాంటి సాహసాలు చేశాడు? `చంటబ్బాయ్` కేసుని ఎలా సాల్వ్ చేశాడు? ఆ కేసుతో పాండుకి ఉన్న కనెక్షన్ ఏంటి? అనే అంశాల చుట్టూ `చంటబ్బాయ్` తిరుగుతుంది. ఇందులో చిరు కామెడీ టైమింగ్.. సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. అలాగే.. చార్లీ చాప్లిన్ గా, మిస్ మేరిగా, హరిదాసుగా, పోతురాజుగా పాటల్లో విభిన్న వేషాల్లో మెగాస్టార్ అలరించారు.
చిరుకి జంటగా సుహాసిని నటించిన ఈ చిత్రంలో ముచ్చర్ల అరుణ, సుత్తి వేలు, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, సాక్షి రంగారావు, శ్రీలక్ష్మీ, పొట్టి ప్రసాద్, జయలలిత ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. చక్రవర్తి స్వరరచనకు వేటూరి పదరచన చేశారు. 1986 ఆగస్టు 22న చిరు బర్త్ డే స్పెషల్ గా రిలీజైన `చంటబ్బాయ్`.. హాస్యప్రియులను మురిపించింది. నేటితో ఈ చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంది.

![]() |
![]() |