![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పూర్ణిమ ఒకే రోజు.. ఆగస్ట్ 22 వచ్చాయి. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌ను ఈరోజు ప్రకటించారు. అజిత్ నటించగా బ్లాక్‌బస్టర్ అయిన తమిళ ఫిల్మ్ 'వేదాళమ్' (2015)కు రీమేక్ అయిన ఈ మూవీకి 'భోళాశంకర్' అనే టైటిల్ పెట్టారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ కథ నడిచే ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిరుకు కీర్తి రాఖీ కడుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ ఫొటోలో అన్నా చెల్లెళ్లుగా ఆకట్టుకుంటున్నారు ఆ ఇద్దరూ. ఒరిజినల్‌లో ఆ క్యారెక్టర్లను అజిత్, లక్ష్మీ మీనన్ పోషించారు.

సందర్భవశాత్తూ కీర్తి తల్లి మేనక కూడా చిరంజీవితో నటించారు. అదీ.. ఆయన జోడీగా కావడం విశేషం. అవును. చిరంజీవి నట జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి 'పున్నమినాగు' (1980). రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగులు అనే యాంటీ హీరో క్యారెక్టర్‌లో చిరు సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో నరసింహరాజు చెల్లెలును ప్రేమిస్తాడు నాగులు. విషంతో పెరిగిన నాగులు ఒక పున్నమి నాటి రాత్రి సన్నిహితంగా గడపడం వల్ల ఆమెకు విషమెక్కి చనిపోతుంది. ఆ పాత్రను మేనక చేశారు. చిరు, మేనకపై చిత్రీకరించిన "పున్నమి రాత్రి పువ్వుల రాత్రి" సాంగ్ బాగా పాపులర్.

అప్పుడు మేనక జతగాడిగా నటించిన చిరంజీవి.. 41 సంవత్సరాల తర్వాత ఆమె కుమార్తె కీర్తికి అన్నయ్యగా నటిస్తుండటం విశేషం. 'పున్నమినాగు' బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించినట్లే.. ఇప్పుడు 'భోళాశంకర్' కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |