![]() |
![]() |
.jpg)
ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్ ప్రేక్షకుల్ని, ప్రత్యేకించి తన అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. మలయాళం సూపర్‌హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌లో రెండు ప్రధాన పాత్రల్ని పవన్ కల్యాణ్, రానా చేస్తున్నారని ఇంతదాకా అనుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. అందుకే టైటిల్ కూడా వారిద్దరి క్యారెక్టర్లు కలిసొచ్చేలా పెట్టారు. తెలుగు రీమేక్ టైటిల్‌ను 'భీమ్లా నాయక్' అంటూ రివీల్ చేయడమే కాకుండా, ఆ రోల్ ఫస్ట్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. అందులో భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్‌ను ప్రెజెంట్ చేశారు.
అయితే ఇదే విమర్శకుల్నీ, విశ్లేషకుల్నీ తెగ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆగస్ట్ 15 లాంటి ఒక ప్రత్యేక సందర్భంలో కేవలం పవన్ కల్యాణ్ చేస్తున్న క్యారెక్టర్‌ను మాత్రమే ఎందుకు ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేశారని సోషల్ మీడియాలో వాదన కూడా నడుస్తోంది. రానా క్యారెక్టర్‌ను ఎందుకు ప్రెజెంట్ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా టైటిల్‌ను కేవలం పవన్ కల్యాణ్ చేస్తున్న పాత్రకే పరిమితం చేయడం ఏమిటని వారు అడుగుతున్నారు. నిజానికి 'భీమ్లా నాయక్' అనేది సినిమా టైటిలేనా, కేవలం క్యారెక్టర్ గ్లిమ్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారా? అని కూడా కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
'భీమ్లా నాయక్' అనేది టైటిల్ అయితే రానా చేస్తున్న డానీ క్యారెక్టర్‌ను సెకండ్ హీరో క్యారెక్టర్‌గా మార్చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒరిజినల్ స్టోరీ ఎలాంటిదైనా, పవన్ కల్యాణ్ ఎంటరైతే ఆయన క్యారెక్టర్ మారిపోతుందనీ, అంతా ఆయనే అవుతారనీ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణగా 'వకీల్ సాబ్'ను ప్రస్తావిస్తున్నారు. హిందీ ఫిల్మ్ 'పింక్'కు 'వకీల్ సాబ్' రీమేక్. ఒరిజినల్‌లో బాధితులైన ముగ్గురమ్మాయిల పాత్రల పరిధి ఎక్కువగా, లాయర్‌గా చేసిన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ పరిధి కాస్త తక్కువగా కనిపిస్తుంది. కానీ తెలుగు రీమేక్‌కు వచ్చేసరికి వకీల్ సాబ్ క్యారెక్టరే సినిమా మొత్తం డామినేట్ చేయడం చూశామనీ, ముగ్గురమ్మాయిల పాత్రలను కుదించేశారనేది వారి వాదన.
అదే తరహాలో ఇప్పుడు రైటర్ బాధ్యతలను తలకెత్తుకున్న త్రివిక్రమ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ స్క్రిప్టును బాగా మార్చేశారనీ, భీమ్లా నాయక్ క్యారెక్టరే మెయిన్‌గా, రానా చేస్తున్న దానిని సపోర్టింగ్ క్యారెక్టర్‌గా మార్చేశారనీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఏదేమైనా రానా చేస్తున్న క్యారెక్టర్‌కు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.
![]() |
![]() |