![]() |
![]() |

కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీపరిశ్రమ సమస్యలపైనా.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకషంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ ప్రముఖులు సమావేశమయ్యారు.
చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్ నారంగ్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కె.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, సునీల్ నారంగ్, స్రవంతి రవికిశోర్, సి. కళ్యాణ్, ఎన్వీ ప్రసాద్, కొరటాల శివ, వి.వి. వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ, భోగవల్లి బాపినీడు, యువి క్రియేషన్స్ విక్కీ - వంశీకృష్ణారెడ్డి.. ఇలా నిర్మాతల సంఘం, పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి? జగన్‌తో ఏం చెప్పాలి.. అన్నదానిపై చర్చించారు. అన్నిటినీ త్వరగా పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్లపై చర్చించనున్నారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్టు ధరలపై ఏం అడగాలి? అనే దానిపై చర్చ నడిచింది. చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తులపై సానుకూల వాతావరణం ఎలా రావాలనే అంశాన్నీ చర్చించారు. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి సినీ ప్రముఖులు మాట్లాడుకున్నారు. చివరకు సీఎం జగన్‌కు విన్నవించాల్సిన అంశాల విషయంలో ఓ కొలిక్కి వచ్చారు.

![]() |
![]() |