![]() |
![]() |

ఒక ఫీల్డులోని సూపర్‌స్టార్ మరో ఫీల్డులోని సూపర్‌స్టార్‌ను కలిశాడు. గురువారం ఆగస్ట్ 12న చెన్నైలో ఈ విశేషం చోటు చేసుకుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎం.ఎస్. ధోని, తమిళ సూపర్‌స్టార్ విజయ్‌ను కలుసుకున్నాడు. ఆ ఇద్దరూ ఒకే చోట షూటింగ్‌లో ఉండగా ఈ కలయిక సంభవించింది.
చెన్నైలోని గోకులం స్టూడియోలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ధోని. అదే స్టూడియోలో నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'బీస్ట్' మూవీ షూటింగ్‌లో ఉన్నాడు విజయ్. ఈ విషయం తెలిసిన ధోని ఆ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి విజయ్‌ను మీట్ అయ్యాడు. ఇద్దరూ విజయ్ పర్సనల్ కారవాన్‌లో భేటీ అయ్యి, కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

వారి మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆలస్యం, దావానలంలా వ్యాప్తిచెందాయి. చాలామంది 'పిక్చర్ ఆఫ్ ద డే' అంటూ క్యాప్షన్ పెట్టి ఆ ఫొటోలను షేర్ చేశారు.

సోమవారం రాత్రే చెన్నైకు వచ్చాడు ధోని. కొంతమంది తోటి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్‌తో కలిసి ఆయన రెండు రోజుల్లో యూఏఈకి వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ త్వరలో మొదలు కానుండటంతో చెన్నై ప్లేయర్స్ మళ్లీ కలుసుకున్నారు.
![]() |
![]() |