![]() |
![]() |

రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్..! అలాంటి రామ్.. ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో నటించిన చిత్రం `కందిరీగ`. `మస్కా` (2009) వంటి విజయవంతమైన చిత్రం తరువాత రామ్, హన్సిక జంటగా నటించిన ఈ సినిమా ద్వారా సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమ్యాడు. ఇందులో `రియల్ హీరో` సోనూ సూద్, అక్ష ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
కథ విషయానికి వస్తే.. శ్రీను (రామ్), శ్రుతి (హన్సిక) ప్రేమించుకుంటారు. అయితే శ్రుతిపై మనసు పడతాడు లోకల్ రౌడీ భవాని (సోనూ సూద్). ఈ నేపథ్యంలో.. శ్రీను తన ప్రేమకథను ఎలా విజయతీరాలకు చేర్చుకున్నాడు? ఇందులో సంధ్య (అక్ష) పాత్ర ఏంటి? అనేదే మిగిలిన సినిమా. ప్రధానంగా ఈ నాలుగు పాత్రల చుట్టే `కందిరీగ` తిరుగుతుంది. నలుగురు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చంద్రమోహన్, జయప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ, రఘుబాబు, ప్రగతి, రమాప్రభ, హేమ, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా.. బ్రహ్మానందం, స్వాతి అతిథి పాత్రల్లో మెరిశారు.
థమన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలు యువతరాన్ని అలరించాయి. మరీముఖ్యంగా.. ``చంపకమాల``, ``ఏంజెలీనా`` హిట్ నంబర్స్ గా నిలిచాయి. హిందీలో `మేన్ తేరా హీరో` (వరుణ్ ధావన్, ఇలియానా, నర్గీస్ ఫక్రి), బెంగాలీలో `పగ్లు 2` (దేవ్, కోయల్ మాలిక్) పేర్లతో రీమేక్ అయిన `కందిరీగ`ని బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. 2011 ఆగస్టు 11న విడుదలై మంచి విజయం సాధించిన `కందిరీగ`.. నేటితో పది వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |