![]() |
![]() |

నటిగా కన్నడ కస్తూరి ప్రియమణి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభంలోనే `ఉత్తమ నటి`గా జాతీయ పురస్కారాన్ని అందుకుందీ ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అవకాశం దొరికినప్పుడల్లా తనలోని నటిని విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూనే ఉంది. ఇక పెళ్ళయ్యాక కూడా తన మార్క్ చాటుతోంది ప్రియమణి. ఒకవైపు సినిమాల్లోనూ.. మరోవైపు వెబ్ సిరీస్ ల్లోనూ సత్తా చాటుతోంది.
ఇదిలా ఉంటే.. ఓటీటీ ట్రెండ్ ఊపందుకున్న ఒకే ప్లాట్ ఫామ్ లో హ్యాట్రిక్ విజయాలను అందుకుని వార్తల్లో నిలుస్తోంది ప్రియమణి. ఆ వివరాల్లోకి వెళితే.. 2019లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1`తో ఓటీటీ వేదిక పరంగా తొలి ఘనవిజయాన్ని చూసిన ప్రియమణి.. గత నెలలో `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`తో అదే ప్లాట్ ఫామ్ లో సెకండ్ టైమ్ సక్సెస్ చూసింది. కట్ చేస్తే.. తాజాగా స్ట్రీమ్ అవుతున్న `నారప్ప` చిత్రంతో ముచ్చటగా మూడో విజయం చూసింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అమెజాన్ ప్రైమ్ లో అమేజింగ్ హ్యాట్రిక్ కొట్టిన మూడు సందర్భాల్లోనూ ఆమె పాత్ర పిల్లలకి తల్లిగానే కనిపించడం విశేషం. మరి.. భవిష్యత్ లోనూ ప్రియమణి అమెజాన్ ప్రైమ్ లో ఈ విజయపరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |