![]() |
![]() |
.jpg)
ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన 'ఖుషి' (2001) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టవడమే కాకుండా పవన్ కల్యాణ్‌ను పవర్‌స్టార్‌గా మార్చేసింది. భూమికను తెలుగు ప్రేక్షకుల కలలరాణిని చేసింది. మణిశర్మ సంగీతం సమకూర్చిన పాటల మధురిమలో సంగీతప్రియులు ఓలలాడారు. ఆ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది. ఇగో అనేది ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి అగాధాలను సృష్టించింది, ఆఖరుకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారనే అంశంతో ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేసిన 'ఖుషి' యూత్‌లో అయితే అసాధారణ క్రేజ్‌ను సాధించింది.
మొదట ఈ సినిమా 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా తమిళంలో వచ్చి ఘన విజయం సాధించింది. ఒరిజినల్‌ను రూపొందించిన ఎస్.జె. సూర్యతోటే ఈ మూవీని శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మించారు. హీరోయిన్‌గా భూమికను తీసుకున్నప్పుడు ఆమె ఒరిజినల్ మూవీ చూశారు. అందులో జ్యోతిక చేసిన పాత్ర, ఆమె నటన భూమికను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగులో ఆ పాత్రకు మధు అనే పేరు పెట్టారు. ఆ పాత్రను బాగా ప్రేమించి నటించింది భూమిక.
తెలుగు సినిమా రిలీజ్ అయ్యాక తను కూడా చూసింది భూమిక. సహజంగానే జ్యోతిక, భూమిక.. ఇద్దరిలో హీరోయిన్ క్యారెక్టర్‌ను ఎవరు బాగా చేశారనే పోలిక వస్తుంది. ఆడియెన్స్ మాత్రం మధు పాత్రను భూమిక బ్రహ్మాండంగా చేసిందనీ, ఒరిజినల్‌లో జ్యోతిక నటనకు ఏమాత్రం తీసిపోలేదనీ అభిప్రాయపడ్డారు. కానీ భూమికకు మాత్రం తనకంటే జ్యోతిక బాగా చేసిందని అభిప్రాయపడడం గమనార్హం. "మీ ఇద్దరిలో ఎవరు బాగా చేశారని మీకు అనిపించింది?" అనే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురైనప్పుడు, "మా ఇద్దరిలో జ్యోతిక ఆ పాత్రను బాగా చేశారని అనిపించింది." అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పింది. అంతే కాదు, ఖుషిలో పవన్ కల్యాణ్ నటన కూడా తనకు బాగా ఇష్టమని ఆమె అన్నది.

![]() |
![]() |