![]() |
![]() |

`కలెక్షన్ కింగ్` మోహన్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. మోహన్ బాబు హీరోగా బి. గోపాల్ నాలుగు చిత్రాలను రూపొందించగా.. అన్ని సినిమాలు కూడా విజయపథంలో పయనించాయి. వాటిలో `అసెంబ్లీ రౌడీ`.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ చిత్రం `వేలై కిడైచ్చిడుచ్చు` (సత్యరాజ్, గౌతమి) ఆధారంగా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్ బాబుకి జంటగా దివ్యభారతి నటించగా.. జగ్గయ్య, అన్నపూర్ణ, గొల్లపూడి మారుతిరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, పాకీజా, మోహన్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనూహ్య పరిస్థితుల్లో జైలుపాలయిన శివాజీ అనే యువకుడు.. ఎలా ఎం.ఎల్.ఎ అయ్యాడు? ఈ క్రమంలో ఏం కోల్పోయాడు? అనే అంశాల చుట్టూ `అసెంబ్లీ రౌడీ` తిరుగుతుంది.
దిగ్గజ స్వరకర్త కేవీ మహదేవన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``అందమైన వెన్నెలలోన`` (కేజే ఏసుదాస్, కేయస్ చిత్ర గానం - రసరాజు సాహిత్యం) గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1991 జూన్ 3న విడుదలైన `అసెంబ్లీ రౌడీ`.. నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |