![]() |
![]() |

మహానటుడు నందమూరి తారకరామారావు నటించగా విడుదలైన చివరి చిత్రం 'శ్రీనాథ కవిసార్వభౌముడు'. ఈ సినిమా కంటే ముందు వచ్చిన చారిత్రక చిత్రాలు 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర', 'సమ్రాట్ అశోక' కానీ, పౌరాణిక చిత్రం 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' కానీ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చినవే. అయితే 'శ్రీనాథ కవిసార్వభౌముడు' చిత్ర దర్శకత్వాన్ని మాత్రం ఆయన బాపు చేతుల్లో పెట్టారు. చాలామందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది.
నిజానికి 'సమ్రాట్ అశోక తీస్తున్న' సమయంలోనే 'లవకుశ'ను మళ్లీ చేయాలని ఉందనీ, దానికి దర్శకత్వం వహించమనీ బాపుగారిని అడిగారు ఎన్టీఆర్. అప్పటికే ఆయన దగ్గర కొండవీటి వెంకటకవి రచించిన 'లవకుశ' స్క్రిప్ట్ ఉంది. ఆయన రాసిన చివరి స్క్రిప్టు అదే. దాన్ని బాపుగారికి ఇచ్చి, "దీన్ని చూడండి. కావాలంటే మార్పులు చేర్పులు చేద్దాం" అన్నారు రామారావుగారు. "లోకోత్తరంగా మీరు పోషించిన రాముడి పాత్రను తెరపై చూసి నమస్కారం చేశాం సర్. అంతకంటే బాగా తియ్యగలమనే నమ్మకం లేదు. హిందీ భాషలో తీద్దామంటే ప్రయత్నించగలం." అన్నారు బాపు-రమణ. అయితే దాన్ని హిందీ భాషలో మాత్రమే తీస్తే గిట్టుబాటు కాదు. దానికి భారీ బడ్జెట్ అవుతుంది.
అందుకే ఆ ప్రాజెక్టుని పక్కనపెట్టి శ్రీనాథుడు గురించి ఆలోచించారు. దివంగత నోరి నరసింహశాస్త్రి గారు 'కవిద్వయం', 'శ్రీనాథ కవిసార్వభౌమ' అనే రెండు గ్రంథాలు రాశారు. ఎన్టీఆర్ దగ్గర సి. నారాయణరెడ్డిగారు రాసిన 'శ్రీనాథుడు' స్క్రిప్టు ఉంది. అయినప్పటికీ ఆ రెండు పుస్తకాలు హక్కులు కొంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చనే నిర్ణయానికి వచ్చారు ఎన్టీఆర్. శాస్త్రిగారబ్బాయి ఢిల్లీలో ఉన్నారని తెలిసి, ఆయనకు ఉత్తరం రాశారు. జవాబివ్వకుండా నేరుగా ఆయనే ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. "ఇలా సినిమా తీద్దామనుకుంటున్నామండీ. మీ నాన్నగారు రాసిన నవలల హక్కులు కావాలి." అని అడిగారు ఎన్టీఆర్. "మీలాంటివారు తీయడానికి పూనుకుంటే అంతకంటే ఇంకేం కావాలి?" అంటూ ఆయన హక్కులు రాసిచ్చారు.
ఆ తర్వాత ఆ పుస్తకాల హక్కులు కొన్నట్లు బాపుగారికి చెప్పారు ఎన్టీఆర్. రమణగారు స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. వారికి, "నేను ఏ విధంగానూ స్క్రిప్ట్ వర్క్‌లో జోక్యం చేసుకోను. నాకు శ్రీనాథుడు పాత్ర వెయ్యాలని ఉంది. నా అనుభవంతో, సామర్థ్యంతో నభూతో నభవిష్యతి అనేవిధంగా చేయాలని ఉంది. ఎందుకంటే చిరస్థాయిగా నిలిచే పాత్ర ఇది. ఆనాడు నాగయ్యగారికి పోతన లాంటి పాత్రలు ఎలా ఉన్నాయో అలాగే శ్రీనాథుని పాత్ర కూడా గొప్పది. అన్‌ప్యారలల్ క్యారెక్టర్ ఇన్ ద లిటరరీ హిస్టరీ." అని చెప్పారు ఎన్టీఆర్. అలా రమణ స్క్రిప్టు రాయగా, బాపు దర్శకత్వం వహించిన శ్రీనాథ కవిసార్వభౌముడు 1993 అక్టోబర్ 21న విడుదలైంది.
![]() |
![]() |